– ఇటువంటి చర్యలతో తమ సంకల్పాన్ని దెబ్బతీయలేరన్న క్యూబా
వాషింగ్టన్ : క్యూబా అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్ కానెల్‌పై మొదటిసారిగా అమెరికా ఆంక్షలు విధించింది. క్యూబన్ల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న క్రూరత్వంలో అధ్యక్షుడు పోషించిన పాత్రకు గానూ ఈ ఆంక్షలు విధించినట్లు శుక్రవారం పేర్కొంది. క్యూబా అధ్యక్షుడికి, ఇతర ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులకు వీసా ఆంక్షలను అమెరికా విదేశాంగ శాఖ జారీ చేసింది. ఈమేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఎక్స్‌లో పోస్టు పెట్టారు. క్యూబాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు జరిగి నాలుగేళ్లు కావస్తున్న సందర్భంగా ఆయన ఈ పోస్టు పెట్టారు. ఆంక్షలు ఎదుర్కొంటున్న వారిలో క్యూబా రక్షణ మంత్రి అల్వారొ లోపెజ్ మిరా, హోం మంత్రి లాజారో అల్బర్టో అల్వారెజ్ వున్నారు. క్యూబా ప్రభుత్వానికి మద్దతుగా అమెరికా డాలర్ల రూపంలో నిధులు అందకుండా చేసేందుకు హవానాలోని 42 అంతస్తుల హోటల్ ‘టోరో కె’ను కూడా అమెరికా తమ ఆంక్షల సంస్థల జాబితాలో చేర్చింది. కాగా తాజా చర్యలను క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రొడ్రిగజ్ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి చర్యలతో క్యూబా ప్రజల, నేతల సంకల్పాన్ని ట్రంప్ ప్రభుత్వం దెబ్బతీయలేదని వ్యాఖ్యానించారు. ఈ హోటల్ ఇటీవల హవానాలో సెంట్రల్ ఏరియా హోటల్‌ను ప్రారంభించింది. దానిపై అమెరికా తీవ్రంగా మండిపడింది. పర్యాటక రంగం క్షీణిస్తున్న సమయంలో కొత్త హోటళ్ళపై క్యూబా ప్రభుత్వం ఇంత పెద్దమొత్తంలో పెట్టుబడుల పెట్టడాన్ని తీవ్రంగా విమర్శించింది. ఒకపక్క క్యూబన్లు ఆహారం, నీరు, మందులు, విద్యుత్ వంటి కొరతలతో ఇబ్బందులు పడుతుంటే మరోపక్క ప్రభుత్వం డబ్బును ఇలా పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతోందని రూబియో విమర్శించారు.
క్యూబా అధ్యక్షుడిపై అమెరికా ఆంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES