– మార్క్ ఫ్రైడ్ జిల్లా మేనేజర్ మహేష్ కుమార్
– ఉప్లూర్ లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల పరిశీలన
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫైడ్ ద్వారా ప్రాథమిక సహకార కేంద్రాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని మార్క్ ఫ్రైడ్ జిల్లా మేనేజర్ మహేష్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని ఉప్లూర్ గ్రామంలో నల్లచెరువు వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కేంద్రంలో మొక్కజొన్న కొనుగోళ్లు జరుగుతున్న తీరును కమ్మర్ పల్లి ప్రాథమిక సహకార కేంద్రం కార్యదర్శి శంకర్ ను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం వద్దకు పలువురు రైతులు తీసుకువచ్చిన మొక్కజొన్నల తేమ శాతాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫ్రైడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాలు మొక్కజొన్నకు రూ.2400 మద్దతు ధర రైతుకు అందించడం జరుగుతుందన్నారు. రైతులు తాము పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వం అందించే మద్దతు ధరను పొందాలని కోరారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకొస్తున్న రైతులకు పలు సలహాలు సూచనలు చేశారు.