Friday, May 9, 2025
Homeరాష్ట్రీయంయూఎస్‌పీసీ, జాక్టో నేతలకు విముక్తి

యూఎస్‌పీసీ, జాక్టో నేతలకు విముక్తి

- Advertisement -

– మహాధర్నా సందర్భంగా పెట్టిన కేసు కొట్టివేత
– ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలం
– నిర్దోషులుగా చావ రవి, లింగారెడ్డి, సదానందంగౌడ్‌
– సికింద్రాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ప్రకటన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) నేతలకు విముక్తి లభించింది. 2020 డిసెంబర్‌ 29న పీఆర్సీ సాధన, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను చేపట్టాలని కోరుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా సందర్భంగా గత ప్రభుత్వం నమోదు చేసిన కేసును సికింద్రాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు గురువారం కొట్టేసింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులపై నమోదు చేసిన కేసుకు సంబంధించి ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైంది. దీంతో యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులు చావ రవి, టి లింగారెడ్డి, జాక్టో చైర్మెన్‌ జి సదానందం గౌడ్‌లను నిర్దోషులుగా ప్రకటించింది. ఆ మహాధర్నాకు పోలీసులు అనుమతించిన సంఖ్య కంటే అదనంగా ఉపాధ్యాయులను సమీకరించారనీ, కోవిడ్‌ ప్రొటోకాల్‌ను అతిక్రమించారంటూ ఆరోపిస్తూ వారిపై గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో 421/2020 ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 269, 290, 341 హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 21/76 కింద 2021, ఏప్రిల్‌ ఒకటిన సికింద్రాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో కేసును నమోదు చేశారు. 2021 జులై 22న మొదటి విచారణ జరిగింది. 39 వాయిదాలతో కొనసాగింది. గతేడాది ఏప్రిల్‌ 22న విచారణ ముగిసింది. ధర్నా కారణంగా ఆ ప్రాంతంలో అసౌకర్యం కలిగినట్టు ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. శాంతి భద్రతలకు భంగం కలగలేదు. అయినా తప్పుడు సాక్ష్యాలతో గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ ఫిర్యాదు మేరకు యూఎస్‌పీసీ, జాక్టో నేతలపై కేసును నమోదు చేశారు. ఉపాధ్యాయ నాయకుల పక్షాన న్యాయవాదులు జీవీఎల్‌ మూర్తి, ఎం స్రవంతి సమర్థవంతంగా కోర్టులో వాదనలను వినిపిం చారు. సికింద్రాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు 19వ అదనపు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఎం అరుణ గురువారం తీర్పును వెలువరించారు. ఆరోపణలను నిరూపించ డంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైనందున కేసును కొట్టేస్తున్నట్టు ప్రకటించారు.
గత పాలకులకు చెంపపెట్టు
ఉపాధ్యాయుల న్యాయమైన పోరాటానికి పెద్ద విజయం లభించిందని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ఎస్టీయూటీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి సదానందంగౌడ్‌, డీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి తెలిపారు. ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తంచేశారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగా కేసును నమోదు చేసిన గత పాలకులకు ఈ తీర్పు చెంపపెట్టు అని విమ ర్శించారు. న్యాయస్థానం తీర్పు కోసం ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉత్కం ఠగా ఎదురుచూశారని తెలిపారు. వారిలో ఎ వెంకట్‌ (టీఎస్‌యూటీఎఫ్‌), సిహెచ్‌ అనిల్‌ కుమార్‌ (టీపీటీఎఫ్‌), కె కృష్ణుడు (బీసీటీఏ), బి కొండయ్య, ఎస్‌ మహేష్‌ (ఎంఎస్‌టీఎఫ్‌), బి సురేంద్ర, సింహాచలం, ఇప్తకార్‌ అహ్మద్‌, పోల్‌ రెడ్డి, రాజా రావు, యాదయ్య, సైదులు, యాదగిరి, జయసింహారెడ్డి, నీరజ, జగన్నాథ శర్మ, రఘుపాల్‌ ఇంకా పలువురు నాయకులు పెద్ద సంఖ్యలో సికింద్రాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టుకు హాజరయ్యారు. తీర్పు వెలువడిన వెంటనే కేసు నుంచి విముక్తి పొందిన నాయకులను అభినందించారు. న్యాయవాది స్రవంతికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -