నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ ఎస్‌ఐఆర్ తుది జాబితాను శుక్రవారం ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్నోలో లోక్‌భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో రిన్వా మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ముసాయిదా జాబితా కంటే.. తుది జాబితాలో 84 లక్షల మందికిపైగా ఓటర్లు చేరారని, మొత్తం ఓటర్ల సంఖ్య 13.39 కోట్లకు చేరిందని ఆయన వెల్లడించారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియ అక్టోబర్ 7 – 2025 నుంచి ఏప్రిల్ 10 – 2026 వరకు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియ 75 జిల్లాల్లో 403 అసెంబ్లీ నియోజకవర్గాలు, పోలింగ్ కేంద్రాలను కవర్ చేసిందని ఆయన పేర్కొన్నారు. జనవరి 6 – 2026న ఎస్‌ఐఆర్ యుసాయిదా జాబితాను రిన్వా విడుదల చేశారు. ఆ జాబితాలో 12,55,56,025 మంది ఓటర్లున్నారు. ఇందులో 6.88 కోట్ల మంది పురుషులు, 5.67 కోట్ల మంది మహిళలు, 4,199 ట్రాన్స్‌జెండర్ ఓటర్లున్నారు. 18–19 వయసు గల ఓటర్లు 3,33,981 మంది ఉన్నారు. ప్రతి వెయ్యి మంది పురుషులకు 824 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
ఇక నేడు విడుదల చేసిన తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 13,39,84,792 మంది ఉన్నారు. పురుషుల ఓటర్లు 7,30,71,071 (54 శాతం), మహిళా ఓటర్లు 6,09,09,525 (45.46 శాతం), ట్రాన్స్ జెండర్ ఓటర్లు 4,206 (0.01 శాతం కన్నా తక్కువ) ఉన్నారు. ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో 18-19 వయసు గలవారు 17,63,360కి పెరిగారు. సుమారు 1.32 శాతం పెరిగింది. లింగ నిష్పత్తి కూడా మెరుగుపడింది. ప్రతి వెయ్యిమంది పురుషులకు 834 మంది మహిళా ఓటర్లున్నారు. మొత్తంగా ముసాయిదా జాబితాకు, తుది జాబితాకు 84, 28,767 మంది ఓటర్లు పెరిగారు. పెరిగిన వారిలో పురుషులు 42,27,902, మహిళలు 42,00,778 మహిళలు, 87 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు పెరిగారు.
ఇక మొత్తంగా 18 – 19 వయసు గల వారు 14,239,379 మందికి పెరగగా, లింగ నిష్పత్తి 824 నుంచి 834కి పది పాయింట్ల మేర పెరిగింది. ఓటర్లు ప్రత్యేకించి కొన్ని జిల్లాలో పెరిగారని ఎన్నికల అధికారి వెల్లడించారు. ప్రయాగ్‌రాజ్‌లో 3,29,421, లక్నో 2,85,961, బరేలీ 2,57,000, ఘజియాబాద్ 2,43,666, జౌన్‌పూర్‌లో 2,37,590 మంది ఓటర్లు పెరిగారు. ఈ ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తికావడానికి ఎన్నికల అధికారులు, రాజకీయపార్టీలు, ఓటర్లను సమన్వయం చేసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని సిఇఓ రిన్వా తెలిపారు.
ఇక ఎస్‌ఐఆర్ ప్రక్రియలో 75 మంది జిల్లాల ఎలక్షన్ ఆఫీసర్లు (డిఇఓ), 403 ఇఆర్‌ఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు), 12,758 అసిస్టెంట్ ఇఆర్‌ఓలు, 18,026 బిఎల్‌ఓ సూపర్‌వైజర్లు, 1,77,516 బూత్ లెవల్ ఆఫీసర్లు (బిఎల్‌ఓ), 5,82,877 మంది బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారని ఆయన తెలిపారు.



