– పంజాబ్, కోల్‌కత మ్యాచ్ వర్షార్పణం
నవతెలంగాణ-కోల్‌కత :
ఈడెన్‌గార్డెన్స్‌లో వరుణుడు రంగ ప్రవేశం చేయగా.. పంజాబ్ కింగ్స్, కోల్‌కత నైట్‌రైడర్స్ మ్యాచ్ వర్షార్పణమైంది. 202 పరుగుల ఛేదనలో కోల్‌కత నైట్‌రైడర్స్ ఒక ఓవర్లో 7/0తో ఉండగా.. ఎడతెగని వర్షం కురవటం మొదలైంది. రాత్రి 11.15 నిమిషాల వరకు వర్షం ఆగకపోవటంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇరు జట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. అంతకుముందు, పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు పంజా విసిరారు. ప్రభుసిమ్రన్ సింగ్ (83, 49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), ప్రియాన్షు ఆర్య (69, 35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ అర్థ సెంచరీలతో విరుచుకుపడ్డారు. తొలి వికెట్‌కు 120 పరుగులు జోడించిన ఓపెనర్లు పంజాబ్ కింగ్స్‌ను భారీ స్కోరు దిశగా నడిపించారు. కానీ మిడిల్ ఓవర్లలో నైట్‌రైడర్స్ స్పిన్నర్ల మాయ, పిచ్ నెమ్మదించటంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 201 పరుగులే చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25 నాటౌట్, 16 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), జోశ్ ఇంగ్లిశ్ (11 నాటౌట్, 6 బంతుల్లో 2 ఫోర్లు) రాణించారు. గ్లెన్ మాక్స్‌వెల్ (7), మార్కో జాన్సెన్ (3) నిరాశపరిచారు. కోల్‌కత నైట్‌రైడర్స్ బౌలర్లలో వైభవ్ అరోర (2/34), వరుణ్ చక్రవర్తి (1/39), అండ్రీ రసెల్ (1/27) రాణించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్‌కు అదిరే ఆరంభం దక్కింది. ప్రియాన్షు ఆర్య (69), ప్రభుసిమ్రన్ సింగ్ (83) ధనాధన్ మోత మోగించారు. ప్రియాన్షు 27 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో అర్థ సెంచరీ సాధించగా.. ప్రభుసిమ్రన్ 38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో అర్థ సెంచరీ సాధించాడు. ప్రియాన్షు క్రీజులో ఉండగా భారీ స్కోరు దిశగా సాగిన పంజాబ్.. ఆ తర్వాత లయ కోల్పోయింది. ఆఖరు ఐదు ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 2 వికెట్లు కోల్పోయి 40 పరుగులే చేసింది.
ఈడెన్‌లో వరుణుడి ఆట
- Advertisement -