– పత్తి, సోయాబీన్ విత్తనాలపై అదనంగా రూ.100 వసూలు
– దోమపోటు రాదంటూ బీటీ-3 నిషేధిత విత్తనాల అమ్మకాలు
– మొక్కుబడి తనిఖీలకే వ్యవసాయ శాఖ పరిమితం
– అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి : సీపీఐ(ఎం)
వానాకాలం సీజన్ ఊపందుకోవడంతో రైతులు సాగు పనుల్లో నిమగమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పత్తి, సోయా, మిరప వంటి పంటల సాగు పనులు ఊపందుకున్నాయి. రైతులు తమకు అవసరమైన విత్తనాల కోసం ఫర్టిలైజర్స్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రయివేట్ విత్తన వ్యాపారులు రైతుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు.
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఏ కంపెనీకి చెందిన హైబ్రీడ్ విత్తన ప్యాకెట్ అయినా రూ.901కి మాత్రమే విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. క్షేత్ర స్థాయిలో మాత్రం అదనంగా రూ.100 వసూలు చేస్తున్నారు. సోయాబీన్ విత్తనాల ధర రూ.2400 మాత్రమే ఉండగా రైతుల నుంచి రూ.2500 తీసుకుంటున్నారు. నగదు రూపంలో అదనంగా డబ్బులు తీసుకుంటున్న వ్యాపారులు రసీదులో మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ధరల్ని మాత్రమే రాస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే విత్తనాల కొరత ఉందనే సాకు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం ఈదులపల్లికి చెందిన రైతు నర్సింహులు విత్తనాల కోసం మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్స్ దుకాణానికి వెళ్లాడు. నాలుగెకరాల భూమిలో పత్తి, సోయాబీన్, మిరప పంటలు సాగు చేసేందుకు విత్తనాలు ఇవ్వాలని అడిగాడు. ఆద్య కంపెనీకి చెందిన నాలుగు పత్తి విత్తన ప్యాకెట్లు (ఒక్కటి 475 గ్రాములు), ఒక సోయాబీన్ సీడ్ సంచి (30 కిలోలు), మిరప విత్తనాలు కావాలని అడిగాడు. సదరు వ్యాపారి పత్తి ప్యాకెట్ ధర రూ.900 చొప్పున నాలుగు ప్యాకెట్లకు రూ.3600, సోయాకు రూ.2400, ఇతర విత్తనాలకు రూ.900 బిల్లు వేశాడు. నగదుగా మాత్రం రూ.400 అదనంగా తీసుకున్నాడు. రసీదులో వేసిన ధరల కంటే ఎక్కువ ఎలా తీసుకుంటారు అని రైతు ప్రశ్నించాడు. పత్తి విత్తనాలపై ప్యాకెట్‌కు రూ.100 అదనంగా ఇవ్వాల్సిందేనని వ్యాపారి చెప్పాడు. అదే రైతు.. మరో ఎరువుల దుకాణంలో సోయాబీన్ విత్తన సంచి ఇవ్వమని అడిగాడు. ఎంఆర్‌పీ ధర రూ.2400 ఉండగా వ్యాపారి మాత్రం రూ.2500 ఇవ్వాలని చెప్పాడు. పత్తి ప్యాకెట్ ధర రూ.901 ధర వేసిన వ్యాపారి సోయాబీన్‌కు మాత్రం రూ.2500 ధర చెప్పాడు. రైతుల అమాయకత్వాన్ని బట్టి వ్యాపారులు ఒక్కొక్కరు ఒక్కో రీతిగా విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తూ రైతుల్ని నిలువు దోపిడీ చేస్తున్న పరిస్థితి. సదాశివపేట మండలంలోనే 30 ఫర్టిలైజర్ దుకాణాలున్నాయి. వీటిల్లో కోట్ల రూపాయల విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వ్యాపారం సాగుతోంది. ప్రతి మండలంలోనూ పత్తి, సోయాబీన్, మిరప వంటి పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి 10 నుంచి 15 వరకు ఫర్టిలైజర్ దుకాణాలున్నాయి. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 3.34 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోంది. సుమారు 6 లక్షల వరకు పత్తి విత్తనాల అవసరముంటుంది. సగటున ఒక్క ప్యాకెట్‌పై రూ.100 చొప్పున పత్తి, సోయాబీన్ విత్తనాలపై వసూలు చేస్తున్న వ్యాపారులు రూ.6 కోట్లకుపైనే రైతుల నుంచి అధిక ధరల పేరిట లూటీ చేస్తున్న పరిస్థితి ఉంది. సిద్దిపేట జిల్లాలోనూ 1.50 లక్షల ఎకరాల్లో పత్తి, మెదక్ జిల్లాలో 50 వేల ఎకరాల్లో పత్తి సాగవ్వనుంది. రెండు జిల్లాల్లోనూ 3.5 లక్షల వరకు పత్తి విత్తన ప్యాకెట్ల వ్యాపారం సాగనుంది.
డిమాండ్ పేర అధిక ధర..
తక్కువ ధరకు కల్తీ విత్తనాలు
పత్తి విత్తనాలకు సంబంధించి బ్రాండెడ్ హైబ్రీడ్ విత్తనాలు బీటీ-1, బీటీ-2 రకాల కొరత ఉందని చెప్పి ఎంఆర్‌పీ ధర రూ.901గా ఉంటే అదనంగా రూ.100 వసూలు చేస్తున్నారు. హైబ్రీడ్ విత్తనాల గురించి రైతులకు శాస్త్రీయమైన అవగాహన లేకపోవడంతో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మరి కొందరేమో నిషేధించబడిన బీటీ-3 పత్తి విత్తనాలను తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. బీటీ-2 కంటే బీటీ-3 విత్తనాలు సాగు చేస్తే 30 శాతం అధిక దిగుబడి వస్తుందని, దోమపోటు అస్సలు రాదని చెప్పి రూ.ఐదారు వందలకే ప్యాకెట్ విత్తనాలను విడిగా విక్రయిస్తున్నారు.
తనిఖీలు పట్టని వ్యవసాయ అధికారులు
ఇంతజరుగుతున్నా వ్యవసాయ అధికారులు తనిఖీలు చేయడంలేదు. పత్తి పంటకు సంబంధించిన విత్తనాల గురించి రైతుల్లో అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖ కంపెనీలకు భయపడి.. అసలు విషయాలను మరుగున పెడుతున్నట్టు తెలిసింది. ఎంఆర్‌పీ ధరలకు మాత్రమే విత్తనాలను విక్రయించడమే కాకుండా రసీదులు తప్పని సరిగా ఇవ్వాలని చెబుతున్నారు. వ్యాపారులు మాత్రం నగదు రూపంలో అదనంగా వసూలు చేసి రసీదులో మాత్రం ఎంఆర్‌పీ ధరల్నే రాస్తున్నారు. పెద్దాపూర్, సదాశివపేట ఇతర ప్రాంతాల్లోని ఫర్టిలైజర్స్ దుకాణాల్లో నిషేధిత గడ్డి మందు, చీడల నివారణ కోసం వాడే ఆయిల్ ప్యాకెట్లను విక్రయిస్తున్నారు.
నిఘా లేకపోవడం వల్లే రైతులకు నష్టం :
గొల్లపల్లి జయరాజు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
విత్తనాలు విక్రయించే వ్యాపారులు రైతుల్ని దోపిడీకి గురి చేస్తున్నారు. పత్తి, సోయాబీన్ విత్తనాలను ఎంఆర్‌పీ ధరల కంటే రూ.100 అదనంగా తీసుకుంటున్నారు. ఒక్కో రైతు పది ఎకరాల్లో పత్తి వేస్తే 20 ప్యాకెట్లపైన రూ.2 వేల వరకు అదనంగా విత్తనాల భారం మోయాల్సి వస్తుంది. విజిలెన్స్, పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు మొక్కుబడి తనిఖీలు చేస్తున్నా కఠిన చర్యలు తీసుకోవడంలేదు. అధిక ధరలకు విత్తనాలు అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి.
నిలువు దోపిడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES