నవతెలంగాణ-హైదరాబాద్: ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్వా జుడుం తీర్పుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. సల్వాజుడుంపై నిర్ణయం తనది కాదని, సుప్రీంకోర్టుదేనని అన్నారు. “కేంద్ర హోంమంత్రితో ఈ విషయంపై నేరుగా చర్చకు దిగాలని అనుకోవడం లేదు. గతంలో ఆ తీర్పు నేనే రాశాను. కానీ, అది నా తీర్పు కాదు.. సుప్రీం కోర్టు ఇచ్చినది. 40 పేజీల ఆ తీర్పును అమిత్ షా చదవాలని ఆశిస్తున్నా. ఒకవేళ అది చదివి ఉంటే ఆ వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదు. ఇదే నేను చెప్పదలచుకున్నా. ఇంతటితో ఈ చర్చను ఆపేద్దాం” అని ఆయన అన్నారు.
శుక్రవారం కొచ్చిలో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్‌షా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణ చేశారు. వామపక్షాలకు అనుకూలంగా పలు తీర్పులు ఇచ్చారని, లేకపోతే దేశంలో ఎప్పుడో నక్సలిజంను లేకుండా చేసే వాళ్లమని, వామపక్షాల ప్రోద్బలంతోనే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని అమిత్ షా నోరుపారేసుకున్నారు.