- కామారెడ్డి ఇంటర్ విద్యాశాఖ అధికారికి డిఎస్‌ఎఫ్ఐ ఫిర్యాదు
నవతెలంగాణ-కామారెడ్డి: ఇంటర్ బోర్డు నుంచి ఎటువంటి అనుమతి లేకపోయినా బోధన్‌లో ఉన్న శ్రీ విజయసాయి జూనియర్ కాలేజ్ పేరుతో… బాన్సువాడ పట్టణంలో బ్రాంచ్ ఏర్పాటు చేసి అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీఎస్‌ఎఫ్‌ఐ) ఉమ్మడి నిజాంబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి షేక్ సలాంకు డీఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జీవన్ రాథోడ్ మాట్లాడుతూ, బోధన్‌లో ఉన్న శ్రీ విజయసాయి జూనియర్ కాలేజ్ పేరుతో బాన్సువాడలో రెండో బ్రాంచ్‌ను అనుమతి లేకుండా నిర్వహిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
గతంలో బుడిమిరోడ్‌లో ఉన్న ఠాగూర్ జూనియర్ కాలేజ్ భవనంలోనే విజయ్ సాయి జూనియర్ కాలేజ్ పేరుతో అడ్మిషన్లు చేపడుతున్నారని తెలిపారు. ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించకుండా, అధికారిక అనుమతులు లేకుండానే కాలేజ్ నిర్వహణ కొనసాగుతుండటం గమనార్హమన్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర ఇంటర్ బోర్డును ఆశ్రయించి జిల్లా నోడల్ అధికారిపై కూడా చట్టపరమైన చర్యలు కోరుతామని హెచ్చరించారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌ఎఫ్‌ఐ బాన్సువాడ డివిజన్ కార్యదర్శి నహీం, సహాయ కార్యదర్శి దాసు తదితరులు పాల్గొన్నారు.



