నవతెలంగాణ-హైదరాబాద్ : కరూర్ తొక్కిలాట తర్వాత ప్రముఖ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ నేడు పుదుచ్చేరిలో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉప్పాలంలోని ఎక్స్‌పో గ్రౌండ్ వేదికగా సభ జరుగుతోంది. కరూర్ ఘటన నేపథ్యంలో పుదుచ్చేరి పోలీసులు విజయ్ సభకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలోకి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి గన్‌తో సభా వేదికలోకి ప్రవేశిస్తూ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డాడు. అయితే, సదరు వ్యక్తి శివగంగై జిల్లా టీవీకే కార్యదర్శి ప్రభుకు గార్డుగా పనిచేసే డేవిడ్‌గా అధికారులు గుర్తించారు.
కాగా, పుదుచ్చేరి పోలీసులు విజయ్ సభకు అనుమతి ఇచ్చినా.. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కొన్ని షరతులు విధించిన విషయం తెలిసిందే. పోలీసులు విధించిన షరతుల మేరకు విజయ్ సభా వేదికపై నుంచి కాకుండా ప్రచారం రథంపై నుంచే మాట్లాడనున్నారు. సభకు 5 వేల మందికి మించి హాజరు కాకూడదు. చిన్నారులు, గర్భిణి మహిళలు, వృద్ధులను ఈ సభకు అనుమతించకూడదు. ఈ నిబంధన మేరకు పార్టీ 5 వేల మందికి మాత్రమే ఎంట్రీ పాసులు ఇవ్వాలి. పాసులు ఉన్నవాళ్లు మాత్రమే సభకు రావాలి. ఈ షరతుల నేపథ్యంలో పుదుచ్చేరి సమీపంలోని తమిళనాడు జిల్లాలకు చెందిన వారు సభకు రావద్దని టీవీకే కోరింది.



