నవతెలంగాణ-హైదరాబాద్: రేపు దేశవ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినాయక మండపాలను గణేష్ భక్తులు సిద్ధం చేశారు. అంతేకాకుండా ఇప్పటికే పలు ప్రాంతాలోని మండపాల్లో ముందస్తుగా గణనాథుని విగ్రహాన్ని నిలబెట్టారు. ఈ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా..పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సమస్యాత్మక ప్రాంతాలను ముందే గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో అదనపు భద్రతా కల్పించనున్నారు.
ప్రతిరోజూ లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ గణపతి వద్దకు వస్తుంటారు. ఇక వారాంతపు రోజులైన శని, ఆదివారాల్లో ఈ సంఖ్య 3 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఈసారి ఇంతకు మించి భక్తులు వస్తారనే అంచనాల నేపథ్యంలో ఖైరతాబాద్ గణపతి వద్ద పోలీసులు ఎప్పుడూ లేనంత బందోబస్తును నిర్వహించనున్నారు. ఈ విషయమై సైఫాబాద్ ఏసీపీ ఆర్. సంజయ్‌కుమార్ వివరాలను మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.
ఇక్కడ ఆరుగురు డీఎస్పీలు, 23 మంది ఇన్‌స్పెక్టర్లు, 52 మంది ఎస్‌ఐలు, 150 మంది కానిస్టేబుళ్లు, 50 మంది మహిళా కానిస్టేబుళ్లు, 22 ప్లటూన్ల సిబ్బందిని వినయోగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజూ తరచుగా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేస్తాయని, 60 సీసీ కెమెరాల ద్వారా భక్తుల భద్రతను సమీక్షిస్తామని తెలిపారు. అన్ని మార్గాల్లో డోర్ ఫ్రేం, హ్యాండ్ మెటల్ డిటెక్టర్లతో భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకే దర్శనానికి అనుమతి ఉంటుందన్నారు. భక్తులు విలువైన ఆభరణాలను, వస్తువులను తీసుకొని రాకూడదని తెలిపారు. ఉత్సవ కమిటీల ప్రతినిధులు అతిథులు, వీఐపీలను సాధ్యమైనంత వరకు ఉదయం నుంచి మధ్యాహ్నంలోపే వచ్చేలా ఆహ్వానించాలని కోరారు.