న్యూఢిల్లీ : దేశంలో విద్యార్థినులు, మహిళలపై దాడులు పెరిగాయని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు పేర్కొన్నారు. అలాగే ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థినుల స్వేచ్ఛ, భద్రతకు భంగం వాటిళ్లుతోందని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కొల్‌కతాలో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్య ఘటన జరిగి ఏడాది అయిన నేపథ్యంలో దేశంలో లింగ ఆధారిత హింస, అన్యాయంపై శనివారం నాడిక్కడ ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర నాయకత్వం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ”ఆర్.జి.కర్ ఘటన తరువాత మనం ఎక్కడ నిలబడతాం? లింగం, హింస, న్యాయం గురించి చర్చించడం” అనే బుక్‌లెట్ విడుదల చేశారు. సంస్థాగత స్థాయిలో అమలు చేయవలసిన ప్రధాన ప్రత్యామ్నాయాలను పేర్కొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదర్శ్ ఎం సాజి, శ్రీజన్ భట్టాచార్య, సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్, ఉపాధ్యక్షురాలు ఎస్. శిల్ప, కేంద్ర కమిటీ సభ్యుడు సూరజ్ ఎలామోన్ పాల్గొన్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన 2014 నుంచి దేశవ్యాప్తంగా మహిళలు, విద్యార్థినుల పరిస్థితిని వివరించారు. 2025 నాటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ప్రకారం 148 దేశాల్లో ఇండియా 131 స్థానంలో ఉందని అన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై జరిగిన నేరాల నమోదులో అనూహ్య పెరుగుదల ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో స్పష్టం చేస్తోందని గుర్తు చేశారు. దేశంలోని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ నివేదిక ప్రకారం పాఠశాలల్లో బాలికల నమోదు రేటు బాలురు కంటే చాలా తక్కువగా ఉందని అన్నారు. ఇది డ్రాపౌట్స్, బాల్య వివాహాలు, బాలికలు ఎదుర్కొంటున్న అణచివేత వంటి సమస్యలను స్పష్టంగా ప్రతిబింబిస్తుందని అన్నారు. సియుఈటి ప్రవేశపెట్టిన తరువాత పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కోచింగ్ మాఫియా, హాస్టల్ సౌకర్యాలు లేకపోవడం, కర్ఫ్యూలు, పాఠ్యాంశాల్లో మార్పులు ఉన్నత విద్యా సంస్థలలో బాలికల స్వేచ్ఛ, భద్రతను ప్రభావితం చేస్తున్నాయని వివరించారు.
దేశవ్యాప్తంగా క్రూరమైన అత్యాచారాలు, మహిళల హత్య ఘటనలతో పాటు, నేరస్థులకు ఆశ్రయం కల్పిస్తూ న్యాయం నిరాకరించటం తీవ్ర వైఫల్యమని అన్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సమాజంలోని వివిధ వర్గాలు మనుస్మృతితో ప్రేరణ పొందిన తిరోగమన నమూనాను అనుసరిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ ఛాందస సిద్ధాంతాలను పాటించడంతో మహిళల స్వేచ్ఛ, భద్రతకు ముప్పు వాటిల్లుతుండటం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కథువా, హత్రాస్, ఉన్నావ్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌లో బాలికలపై అత్యాచారం, హత్య, దాడి జరిగిన ఘటనలు మహిళలపై వ్యవస్థాగత దాడిని సులభతరం చేయడంలో పాలకవర్గం పాత్రను బహిర్గతం చేస్తున్నాయని స్పష్టం చేశారు. అత్యాచారం, వేధింపులకు పాల్పడిన నేరస్థులను బలపరిచే ధోరణి, అధికార పార్టీతో వారి సన్నిహిత సంబంధాలు, వారి శిక్షా నిబంధనలలో సడలింపు, బహిరంగ ప్రదేశాల్లో వారికి లభించే అద్భుతమైన స్వాగతం, అటువంటి దాడులను అధికారులు ఎలా నిర్వహిస్తారనే దానిపై లోతైన అంతర్దృష్టిని అందిస్తుందని అన్నారు. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ఘటన విషయంలో బిజెపి-టిఎంసి మధ్య నిశ్శబ్ద అవగాహన స్పష్టంగా కనిపించిందని అన్నారు. ఇది సిబిఐ సరైన విచారణ చేయకుండా, నేరస్థులను చట్టం ముందు నిలబెట్టకుండా నిరోధించిందని విమర్శించారు.
విద్యార్థినుల గౌరవం,
భద్రతకు ప్రతిపాదించిన కొన్ని చర్యలు
- విద్యా సంస్థల్లో జిఎస్‌క్యాస్ పునరుద్ధరణ, బలోపేతం
- అన్ని క్యాంపస్‌ల్లో తప్పనిసరి విద్యార్థి సంఘాల ఎన్నికలు
- సమగ్ర జెండర్ సెన్సిబులిటీ కార్యక్రమాలు
- క్యాంపస్ సమగ్ర మౌలిక సదుపాయాలు
- క్యాంపస్‌ల్లో రెగ్యులర్ భద్రతా ఆడిట్‌లు
- అత్యవసర మద్దతు వ్యవస్థలు
- పోక్సో చట్టం పునర్నిర్మాణం.