Saturday, November 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఅభివృద్ధికి ఓటేయ్యండి

అభివృద్ధికి ఓటేయ్యండి

- Advertisement -

– మీ గల్లీ బిడ్డను గెలిపించండి
– అసెంబ్లీలో మీ గొంతుకై సమస్యలు ప్రస్తావిస్తారు
– జూబ్లీహిల్స్‌ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా..
– ముసుగేసుకొస్తున్న పదేండ్లు దోచుకున్న దోపిడీ దొంగలు
– నగరాభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
– జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం

నవతెలంగాణ-సిటీబ్యూరో, జూబ్లీహిల్స్‌
జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఎమ్మెల్యేగా నవీన్‌ యాదవ్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓటర్లను కోరారు. ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గం ప్రజలకు అండగా ఉంటానని.. సెంటిమెంట్‌కు కాకుండా అభివృద్ధికి ఓటు వెయ్యాలని అన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని రహమత్‌నగర్‌ డివిజన్‌ నుంచి వెంగళరావునగర్‌ డివిజన్‌ మీదుగా సోమాజిగూడ డివిజన్‌ వరకు శుక్రవారం రాత్రి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు మద్దతుగా సీఎం రోడ్‌ షో నిర్వహించారు. రహమత్‌నగర్‌లోని పీజేఆర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు అనిల్‌ యాదవ్‌ సభాధ్యక్షతన జరిగిన కార్నర్‌ మీటింగ్‌, ఎస్‌ఆర్‌నగర్‌ చౌరస్తాలో జరిగిన రోడ్‌ షోలో సీఎం ప్రసంగించారు. ”రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి.. ఎత్తు పల్లాలు ఉంటాయి.. అవకాశం వచ్చినప్పుడు మన బిడ్డను గెలిపించుకోకపోతే చారిత్రక తప్పిదం అవుతుంది” అని అన్నారు. బీఆర్‌ఎస్‌ సెంటిమెంట్‌ పేరుతో ముందుకొచ్చిందని విమర్శించారు. 2007లో పీజేఆర్‌ అకాల మరణం తర్వాత ఉప ఎన్నికలో.. పీజేఆర్‌పై గౌరవంతో రాజకీయ వైరుధ్యాన్ని చంద్రబాబు పక్కనపెట్టి.. ఆ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి సహకరించారని గుర్తు చేశారు. కానీ, పీజేఆర్‌ కుటుంబంపై పోటీకి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని నిలబెట్టిందన్నారు. ఈ దుష్ట సంప్రదాయానికి తెర తీసింది కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ నేతలు కాదా? అని ప్రశ్నించారు. అలాంటి వాళ్లు ఇవాళ సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నారని విమర్శించారు. ”పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి, మున్సిపల్‌ మంత్రి ఎప్పుడైనా జూబ్లీహిల్స్‌కు వచ్చారా..? ఇక్కడి ప్రజల ముఖం చూశారా..? మీ సమస్యల గురించి పట్టించుకున్నారా..” అని సీఎం ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాతే నియోజకవర్గ ప్రజలకు అనేక విధాలా అండగా నిలిచిందన్నారు.
మరోవైపు మేం ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటుంటే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మెట్రో రైలుకు.. మూసీకి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్‌కు పేరొస్తుందనే.. బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై ఆయన హైదరాబాద్‌ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్‌ బంధమన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అవయవదానం చేసి బీజేపీని గెలిపించిందని ఆరోపించారు. బీజేపీ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి రాష్ట్రానికి ఏమైనా నిధులు తెచ్చారా? జూబ్లీహిల్స్‌లో కార్పెట్‌ బాంబింగ్‌ చేస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే.. ఆటో వాళ్లను రెచ్చగొట్టి ఫ్రీ బస్సు బంద్‌జేయాలని బయలుదేరారని అన్నారు. బిల్లా, రంగాలు ఆటోలలో తిరుగుతూ.. ఫొటోలు దిగుతున్నారని విమర్శించారు. మన ప్రభుత్వం పేదల ప్రభుత్వమని.. యువకుడు నవీన్‌ యాదవ్‌ను గెలిపించాలని, అసెంబ్లీలో మీ గొంతుకై మీ సమస్యలను ప్రస్తావిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. ఎమ్మెల్యేగా నవీన్‌ యాదవ్‌, మంత్రిగా అజారుద్దీన్‌ ప్రజలకు నిత్యం అండగా ఉంటారని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో గెలిపించండి.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని అన్నారు. పదేండ్లు దోచుకున్న దోపిడీ దొంగలు ముసుగు వేసుకుని జూబ్లీహిల్స్‌కు వస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇస్తే బీజేపీకి ఎందుకంత కడుపుమంట..? అని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ”జూబ్లీహిల్స్‌ నుంచి నాకొక కుడి భుజాన్ని ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను.. మైత్రీవనంలో తారక రామారావు విగ్రహం పెడతాం.. నేను ఆవిష్కరణ చేస్తా.. రాబోయే 40 ఏండ్లు మీకు నవీన్‌ అండగా ఉంటాడు.. భారీ మెజారిటీతో గెలిపించండి..” అని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు యాదవ సోదరులు సీఎం రేవంత్‌రెడ్డికి గొర్రె పిల్ల, గొంగడిని బహుకరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్‌యాదవ్‌, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -