– పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి : సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రజాభవన్‌లో పంచాయతీ, మున్సిపల్ కార్మికుల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలనీ, మూడు నెలల బకాయిలను విడుదల చేయడంతో పాటు పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ల(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జనగాం రాజమల్లు, చాగంటి వెంకటయ్య, రాష్ట్ర కార్యదర్శి పాలడుగు సుధాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నోడల్ అధికారి దివ్యకు వినతిపత్రాన్ని అందజేశారు. నోడల్ అధికారికి సమస్యలను వివరించారు. వివిధ మున్సిపాల్టీల్లో మూడు, నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదనీ, వేతనాల సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరినప్పటికీ వేతనాలకు సంబంధించిన చెక్కులను ట్రెజరీలలో వేశామని తప్పించుకుంటున్నారని ఆమె దృ’ష్టికి తీసుకెళ్లారు. సీఎం ప్రకటించినట్టుగా పంచాయతీ కార్మికులకు గ్రీన్‌చానల్ ద్వారా వేతనాల చెల్లింపు ప్రక్రియ ప్రారంభించాలనీ, మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేసి ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఆన్‌లైన్‌లో ఎక్కించకుండా మిగిలిపోయిన కార్మికుల పేర్లను నమోదు చేయాలని విన్నవించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. తాము లేవనెత్తిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. పంచాయితీ కార్మికులు చేయబోతున్న నిరవధిక సమ్మెను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఆకుల వెంకటేష్, వెంకటస్వామి, గుర్రం అశోక్, శ్రీనివాస్, గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర నాయకులు రాపర్తి రాజు, నారోజు రాంచందర్, రాంచందర్, వెంకటేష్ గౌడ్, ఎమ్‌డీ కాజా, ఆసిఫ్ తదితరులతో పాటు పలు ప్రమాదాలలో మరణించిన వారి కుటుంబాల వారు పెద్దఎత్తున తరలొచ్చారు.
కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES