Thursday, May 22, 2025
Homeజాతీయంవక్ఫ్‌బోర్డుల్లో ముస్లిమేతరులు ఉంటారు

వక్ఫ్‌బోర్డుల్లో ముస్లిమేతరులు ఉంటారు

- Advertisement -

– ఇవి లౌకిక విధులనే నిర్వహిస్తాయి
– ఎవరి పనితీరు ప్రభావితం కాదు : సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదనలు

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులు వుంటారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వైవిధ్యతను పెంపొందించడం కోసమే వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులను చేరుస్తున్నామని, ఈ వక్ఫ్‌ బోర్డులు లౌకిక విధులను నిర్వహిస్తాయని, అందువల్ల ముస్లిమేతరులతో సహా ఎవరి పనితీరు ప్రభావితం కాదని కేంద్రం ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల, వక్ఫ్‌ బోర్డులలో ముస్లిమేతరులను చేర్చడాన్ని అనుమతిస్తామని, అది కూడా కేవలం ఇద్దరికి మాత్రమే పరిమితం చేశామని స్పష్టం చేసింది. దీనివల్ల వక్ఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ యొక్క ఇస్లామిక్‌ స్వభావం విషయంలో రాజీ పడకుండా సమతూకంతో కూడిన పారదర్శక పాలనకు హామీ కల్పించబడు తుందని కేంద్రం పేర్కొంది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం కూడా విచారణ కొనసాగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌ గవారు, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మాసిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. వక్ఫ్‌ అనేది ఇస్లామిక్‌ భావనే గానీ ఇస్లాంలో కీలక భాగం కాదన్నారు. ఇది ప్రాథమిక హక్కు కాదన్నారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలను, వాళ్ల ఆస్తుల్ని సంరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద వుందన్నారు. ప్రజల ఆస్తులను అక్రమంగా పక్కదారి పట్టించే ప్రయత్నాలను సర్కారు చూస్తూ ఊరుకోద న్నారు. వక్ఫ్‌ చట్టంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్‌ బోర్డు ఉన్నది సేవ కోసమేనని అన్నారు. వక్ఫ్‌ బోర్డులో ఇద్దరు ముస్లిమేతరులు వుంటే వచ్చే నష్టం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇందులో మతపరమైన అంశాల జోక్యమేమీ లేదన్నారు. వక్ఫ్‌ చట్టానికి సవరణలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏకంగా 96లక్షల మంది ముస్లింలను కలిసిందన్నారు. వారందరితో చర్చోపచర్చల తరువాత అందరి సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని కేంద్రం ఈ చట్టాన్ని సవరించిందన్నారు. ”దానధర్మాలు ప్రతి మతంలో భాగమని, క్రైస్తవులు, హిందువులు, సిక్కులకు కూడా ఈ దాన వ్యవస్థ వుంది. వక్ఫ్‌ అనేది ఇస్లాంలో దాతృత్వం తప్ప మరొకటి కాదు. వక్ఫ్‌ బోర్డు వక్ఫ్‌ ఆస్తులను నిర్వహించడం, అకౌంట్‌ ఖాతాలను ఆడిట్‌ చేయడం వంటి లౌకిక విధులను మాత్రమే నిర్వహిస్తుంది. నేను ముస్లిమేతరులైన ఇద్దరు సభ్యుల గురించే చెబుతున్నాను. వక్ఫ్‌ బోర్డులలో ఇద్దరు ముస్లిమేతరులు వుండటం వల్ల ఏమి మారుతుంది. వక్ప్‌ Ûబోర్డుకు ఎలాంటి మతపరమైన కార్యకలాపాలకు సంబంధం లేదు.’ అని మెహతా అన్నారు.
వక్ఫ్‌కు, హిందూయేతరులను సభ్యులుగా అనుమతించని హిందూ ట్రస్టులు, ఎండోమెంట్‌ బోర్డులకు మధ్య గల తేడా గురించి కూడా చెప్పడానికి ఆయన ప్రయత్నించారు. హిందూ ఎండోమెంట్‌ బోర్డులలో హిందూయేతరులను అనుమతించనప్పుడు, ముస్లిమేతరులను వక్ఫ్‌ బోర్డులలో ఎలా అనుమతిస్తారన్నది పిటిషనర్లు చేస్తున్న వాదనలలో ఒకటి.
”హిందూ ఎండోమెంట్‌ బోర్డులు కేవలం మతపరమైన కార్యకలాపాలను మాత్రమే నిర్వహిస్తాయని అదే సమయంలో వక్ఫ్‌ బోర్డు లౌకిక కార్యకలాపాలను నిర్వహిస్తుంది.” అని చెప్పారు. హిందూ ఎండోమెంట్‌ బోర్డుల అధికారాల పరిధి చాలా విస్తారంగా వుంటుందని, వారు కావాలంటే ఆలయం లోపలకు కూడా వెళ్ళగలరని, పూజలకు ఏం కావాలో కొనగలరని చెప్పారు. తమిళనాడులో అర్చకులను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తోందని, కానీ ఇక్కడ మాత్రం మనం లౌకిక వక్ఫ్‌ బోర్డుల్లో ఇద్దరు ముస్లిమేతరులు వుండడంపై వివాదాన్ని చేస్తున్నామని తుషార్‌ మెహతా వాదించారు. వక్ఫ్‌బోర్డుల్లో 11మంది సభ్యుల్లో ఇద్దరు, సెంట్రల్‌ కౌన్సిల్‌లో వుండే 22మంది సభ్యుల్లో నలుగురు ముస్లిమేతరులు అయినంత మాత్రాన అది ఉల్లంఘనల కిందకు రాదని మెహతా వాదించారు.
ఇస్లాంకి సంబంధించిన ఎలాంటి మతపరమైన అంశాల విషయంలో వక్ఫ్‌ చట్టం-2025 జోక్యం చేసుకోదని కేవలం ముతవాలీ (వక్ఫ్‌ ఆస్తుల మేనేజర్‌) గురించే మాట్లాడుతోందని రుజువు చేయడానికే తాను ఈ అంశాన్ని లేవనెత్తానని చెప్పారు. ముతవాలీలను ఎవరు నియమిస్తారని సీజేఐ ప్రశ్నించగా, వక్ఫ్‌ బోర్డేనని చెప్పారు. అయన ముస్లిమేతరుడు అయి వుండవచ్చా అనగా వుండొచ్చునని, ఆయనకు ఎలాంటి మత పరమైన కార్యకలాపాలు వుండవన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -