నవతెలంగాణ-హైదరాబాద్ : ఇజ్రాయెల్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఇరాన్ దేశాన్ని టార్గెట్ చేసుకొని యుద్ధ విమాణాలతో విరుచుకుపడ్డాయి. దీంతో ఆగ్రహించిన ఇరాన్ బహ్రెయిన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా మరియు UAE వంటి ప్రాంతాలపై ప్రతికార దాడులు చేసింది. దీంతో అప్రమత్తం అయిన ఆయా దేశాలు వారి గగనతలాన్ని మూసివేశారు. ఈ కారణంగా వివిధ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధు దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయారు.
ఇంగ్లండ్‌లో జరగబోయే ‘ఆల్ ఇంగ్లండ్ ఓపెన్’ టోర్నమెంట్‌కు వెళ్తుండగా, ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన యుద్ధ ఉద్రిక్తతల వల్ల విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆమె అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్ట్ పైన క్షిపణులను అడ్డుకుంటున్న శబ్దాలు వినబడుతున్నాయని, పరిస్థితి చాలా భయంకరంగా ఉందని ఆమె సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతానికి తాను, తన బృందం సురక్షితంగానే ఉన్నామని, అయితే ఎయిర్‌పోర్ట్ అంతా గందరగోళంగా ఉందని సింధు తన పోస్టులో తెలిపారు. అనేక కుటుంబాలు ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాయని, సాధారణ జీవితం ఎంత సున్నితమైనదో ఇలాంటి సమయాల్లోనే అర్థమవుతుందని ఆమె పేర్కొన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి సంబంధించిన వార్తలు, గల్ఫ్ దేశాలపై జరుగుతున్న క్షిపణి దాడుల నేపథ్యంలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం తన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.



