యుద్ధ మేఘాలు..

War clouds– హమాస్‌, ఇజ్రాయిల్‌ ఘర్షణలో వెయ్యి మందికిపైగా మృతి
– గాజాను శిథిలం చేస్తా: నెతన్యాహు
– ఇజ్రాయిల్‌పై మోర్టార్లతో హిజ్బుల్లాల దాడి
– ఈజిప్టులో ఇద్దరు ఇజ్రాయిలీ టూరిస్టుల కాల్చివేత
గాజా సిటీ: పాలస్తీనా సాయుధ గ్రూపు హమాస్‌, ఇజ్రాయిల్‌ బలగాల మధ్య దాడులు, ప్రతిదాడులు ఆదివారం మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ ఘర్షణల్లో మృతుల సంఖ్య వెయ్యిమందికి పైనే దాటింది. హమాస్‌పై ఇజ్రాయిల్‌ అధికారికంగా యుద్ధం ప్రకటించిందని నెతన్యాహు కార్యాలయం ఆదివారం వెల్లడించింది. హమాస్‌కు పట్టు ఉన్న గాజాప్రాంతాన్ని శిథిలంగా మారుస్తానని పచ్చి మితవాది, బెంజిమిన్‌ నెతన్యాహు ప్రకటించారు. ఆయన యుద్ధ ప్రతిపాదనకు భద్రతావ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ శనివారం రాత్రి ఆమోదం తెలిపింది. గాజాపై ఇప్పటికే ఇజ్రాయిల్‌ వైమానిక దళాలు పెద్దయెత్తున దాడులకు దిగాయి.. ఈ దాడులు రెండవ రోజు కూడా కొనసాగడంతో గాజా ప్రజల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు కురిపిస్తున్న బాంబుల వర్షానికి పాలస్తీనా నేషనల్‌ ఇస్లామిక్‌ బ్యాంక్‌తో బాటు పలు పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడులో 380 మంది పాలస్తీనియన్‌ పౌరులు చనిపోయారని, మరో 2200 మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. వందలాది మంది క్షతగాత్రులతో గాజా సిటీలో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇజ్రాయిల్‌ వైమానిక దాడుల వల్ల గాజా సిటీలో 80 శాతం ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. మహిళలు, పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇదిలా ఉండగా లెబనాన్‌ నుంచి ఇజ్రాయిల్‌ ఆక్రమిత షెబా ఫామ్‌ ప్రాంతంపై హిజ్బుల్లా సాయుధ గ్రూపు మోర్టార్లతో దాడి చేసింది. దీనికి ఫిరంగులతో సమాధానం చెబుతామని ఇజ్రాయిల్‌ తెలిపింది. ఈజిప్టులో పోలీసులు ఇద్దరు ఇజ్రాయిలీ టూరిస్టులను కాల్చివేసినట్టు అల్‌జజీరా వెబ్‌సైట్‌ తెలిపింది.
గాజా రక్త గాథ..
గాజా భూభాగాన్ని దిగ్బంధించటం, హమస్‌ పార్టీ కార్యకర్తలను హత్యలు చేయటం, అల్‌ అక్సా మసీదు ప్రాంతంలో ముస్లింలను రెచ్చగొట్టటం ఇజ్రాయిల్‌ కు నిత్యకృత్యం. గాజాలో భరించలేనంత అణచివేతకు ఇజ్రాయిల్‌ పాల్పడటంవల్లనే ప్రతిఘటన అనివార్యం అయింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, యూరోపియన్‌ యూనియన్‌ నాయకులు ఇజ్రాయిల్‌ ఎటువంటి అకృత్యాలకు పాల్పడినా ఎటువంటి విమర్శ చేయకుండా మద్దతునిస్తూ పాలస్తీనా ప్రతిఘటనను మాత్రం ”టెర్రరిజం”గా ప్రకటించటం ఘోరమైన విషయం. సామ్రాజ్యవాద దేశాలు అణచివేతకు గురైన వాళ్ళను కాకుండా అందుకు పాల్పడే వాళ్ళకే మద్దతునివ్వటం చారిత్రిక సత్యం. అణచివేతకు గురైనవాళ్ళు ప్రతిఘటించటం మొదలవగానే హడావిడిగా ఖండనలు మొదలవుతాయి. ఇజ్రాయిల్‌ ప్రభుత్వానికి ఒక నేరస్తుడు నాయకత్వంవహిస్తున్నాడని, అతని ప్రభుత్వం ఫాసిస్టులైన జాతి దురహంకారవాదులతో నిండివున్నదన్న వాస్తవాన్ని చూడటానికి మీడియా సైతం సిద్ధంగా లేదు.
ఉక్రెయిన్‌ యుద్ధం గురించి రాసేటప్పుడు సామ్రాజ్యవాద దేశాల మీడియా ”క్రైమియాను చట్టవిరుద్దంగా ఆక్రమించిన రష్యా” అని రాయకుండా ఉండదు. క్రైమియాను ఉక్రెయిన్‌ తిరిగి స్వాధీనం చేసుకునేదాకా అమెరికా మద్దతు ఇస్తూనే ఉంటుందని అమెరికా ప్రకటిస్తూనే ఉంటుంది. అయితే ఇజ్రాయిల్‌ చట్టవిరుద్దంగా పాలస్తీనా భూభాగాలను ఆక్రమించుకోవటాన్ని అమెరికా ఎన్నడూ ఖండించలేదు. గాజాలో నివసించే పాలస్తీనియన్లకు కోట్లాది డాలర్ల విలువైన ఆయుధాలను సరఫరా చేసే మద్దతుదార్లు ఎవ్వరూ లేరు. ఇజ్రాయిలీ మిలిటరీ ఆక్రమణలకు వ్యతిరేకంగా పాలస్తీనియన్లు సాయుధ తిరుగుబాటు మొదలెట్టగానే అమెరికా ప్రతిసంవత్సరం ఇజ్రాయిల్‌ కు 100ల కోట్ల డాలర్ల విలువగల ఆయుధాలను సరఫరా చేస్తుంది. పాలస్తీనా యోధులను టెర్రరిస్టులుగా నాటో దేశాల మీడియా అభివర్ణిస్తోంది. వాస్తవంలో పాలస్తీనా జనసాంధ్రత ఎక్కువగావున్న గాజా ప్రాంతంలో విచక్షణారహితంగా ఇజ్రాయిల్‌ చేస్తున్న దాడులలో వేలాది పాలస్తీనా ప్రజలు మరణించారు. శనివారం రాత్రి ఎప్పటినుంచో దిగ్బంధానికి గురైన గాజా ప్రాంత పాలస్తీనీయుల సమూహిక హననానికి నెతాన్యాహు పిలుపునిచ్చాడు. పాలస్తీనా నగరాలను శిథిలాలుగా మార్చటానికి ఇజ్రాయిల్‌ సర్వసన్నద్దం అవుతోంది. ఇజ్రాయిలీ ప్రభుత్వంలోగల రెలిజియస్‌ జియోనిస్టు పార్టీ ఆక్రమిత ప్రాంతాలనుంచి పాలస్తీనా ప్రజలను పారద్రోలాలని, పాలస్తీనీయుల హననానికి పాల్పడాలని, అల్‌ అక్సా మసీదును ధ్వంసం చెయ్యాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. పాలస్తీనావాసులు ఇజ్రాయిలీ ఘాతుకాలను ప్రతిఘటించజాలరనే జాతి దురహంకార ఇజ్రాయిలీ ప్రభుత్వ అంచనాలకు భిన్నంగా పాలస్తీనా ప్రజలు అనూహ్యంగా తిరగబడి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు ఎటువంటి వైఖరి తీసుకున్నా ప్రపంచ వ్యాప్తంగా 100ల కోట్ల ప్రజల సహానుభూతి పాలస్తీనా ప్రజలకు ఉంది.
అనేక అరబ్‌ దేశాల ప్రభుత్వాలు ఘర్షణలను అదుపులో ఉంచాలని ఇరుపక్షాలను కోరాయి. అల్‌ అక్సా మసీదు విధ్వంసాన్ని ఆపే బాధ్యత ఇజ్రాయిల్‌ దేనని కతార్‌ ఒక ప్రకటనను విడుదల చేసింది. పాలస్తీనా ప్రజలను ఇజ్రాయిలీ హింసకు గురికాకుండా చూడవలసిన బాధ్యత అంతర్జాతీయ సమాజంపైన ఉన్నదని కూడా ఆ ప్రకటనలో ఉంది. నిరంతరం పాలస్తీనా భూభాగాలను ఆక్రమిస్తూ పాలస్తీనా ప్రజల న్యాయమైన హక్కులను ఇజ్రాయిల్‌ కాలరాస్తున్నదని సౌదీ అరేబియా విదేశాంగ శాఖ పేర్కొంది. గరిష్ట సంయమనం పాటించి పౌరుల ప్రాణ నష్టాన్ని నివారించకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఈజిప్టు హెచ్చరించింది. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని, అల్‌ అక్సా మసీదు చారిత్రిక, మతపరమైన అతస్తుకు భంగం కలుగకుండా చూడాలని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగాన్‌ అన్నాడు. ఇజ్రాయిల్‌ ఆక్రమణల కొనసాగింపుకు నిరసనగానే హమస్‌ ప్రతిఘటనను చూడాలని లెబనాన్‌ స్థావరంగా పనిచేస్తున్న హెజ్బొల్లా మిలిటెంట్‌ గ్రూపు ఒక ప్రకటనలో పేర్కొంది.

Spread the love