Tuesday, May 13, 2025
Homeజాతీయంయుద్ధమంటే బాలివుడ్‌ సినిమా కాదు

యుద్ధమంటే బాలివుడ్‌ సినిమా కాదు

- Advertisement -

– దౌత్యానికే తొలి ప్రాధాన్యత : ఆర్మీ మాజీ చీఫ్‌ నరవణె
న్యూఢిల్లీ:
భారత్‌, పాకిస్తాన్‌లు సైనిక చర్యలకు స్వస్తి పలుకుతూ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఎదురవుతున్న విమర్శలపై ఆర్మీ మాజీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె తీవ్రంగా స్పందించారు. యుద్ధమంటే బాలివుడ్‌ సినిమా కాదని వ్యాఖ్యానించారు. కాల్పులు జరుగుతున్నాయంటే సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజల్లో తీవ్రమైన భయాందోళనలు రేకెత్తుతాయని అన్నారు. ”యుద్ధం మొదలైందంటే చావు, విధ్వంసం చోటు చేసుకుంటాయి. కచ్చితంగా అందుకు మూల్యం చెల్లించాల్సి వుంటుంది.” అని అన్నారు. ”కాబట్టి యుద్ధమంటే అదేదో బాలివుడ్‌ సినిమాలో చూపించేలా రొమాంటిక్‌గా వుండదు. ఇది చాలా తీవ్రమైన అంశం. యుద్ధం లేదా హింస అనేది చిట్టచివరిగా చేపట్టాల్సిన అంశం. ముందుగా దౌత్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. తెలివితక్కువ వారి చేష్టలతో ఒకోసారి మనం కూడా యుద్ధాలు చేపట్టాల్సి వస్తూ వుంటుంది. కానీ అదేమీ ఆనందం కలిగించే అంశం కాదు, ఒక సైనికుడిగా ఆదేశిస్తే కచ్చితంగా నేను యుద్ధానికి వెళతా, కానీ అది నా ఫస్ట్‌ ఎంపికగా వుండదు, దౌత్యానికి నా మొదటి ప్రాధాన్యత, చర్చలతోనే విభేదాలను పరిష్కరించుకోవాలి, అంతేకాని సాయుధ ఘర్షణలకు వెళ్లరాదు.” అని నరవణె సూచించారు. అలాగే దాడులు, యుద్ధాల వల్ల పునర్నిర్మాణ వ్యయమే కాకుండా, ధ్వంసమైన సైనిక సామాగ్రిని మళ్లీ సమకూర్చుకునే వ్యయాన్ని కూడా భరించాల్సి వుంటుంది.” అని ఆయన వ్యాఖ్యానించారు. పూనేలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా వజ్రోత్సవాల్లో నరవణె ఆదివారం ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ”యుద్ధం, యుద్ధ విన్యాసాలు ఖరీదైన వ్యవహారం. ఇటువంటి ఘర్షణలు, యుద్ధాలతో కూడిన వాతావరణాన్ని వారాలు, నెలలల తరబడి సుదీర్ఘ కాలం మనం కొనసాగించినట్లైతే …ఒక్కసారి ఊహించండి, తక్షణమే మనకు ఎంత నష్టం జరుగుతుందో.. యుద్ధం చివరిలో ఒక్కసారిగా మనం పునరావలోకనం చేసుకుంటే ఈ నష్టం ఏ స్థాయిలో వుంటుందో తెలుస్తుంది.” అని ఆయన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -