Tuesday, April 29, 2025
Homeజాతీయంయుద్ధం ఎంపిక కాకూడదు: రా మాజీ చీఫ్‌

యుద్ధం ఎంపిక కాకూడదు: రా మాజీ చీఫ్‌

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: యుద్ధం ఎంపిక కాకూడదని, జమ్ముకాశ్మీర్‌కు రాష్ట్రహోదాను పునరుద్ధరించడానికి ఇది సరైన సమయమని రా మాజీ చీఫ్‌, జమ్ముకాశ్మీర్‌ మాజీ సలహాదారు అమర్‌జిత్‌ సింగ్‌ దౌలత్‌ పేర్కొన్నారు. మంగళవారం బెంగళూరులో ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. యుద్ధం అనేది ఒక ఎంపిక కాకూడదని తాను ఎల్లప్పుడు కోరుకుంటానని, యుద్ధం జరగకూడదని ఆశిద్దామని అన్నారు. ఒకవేళ యుద్ధం వచ్చినా.. అది చివరి ఎంపిక మాత్రమే కాదు, చివరి తప్పు ఎంపిక అని, ఏ దేశమూ యుద్ధాన్ని భరించలేదని అన్నారు. పాకిస్థాన్‌పై ఇటువంటి దాడులకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ముందున్న ఇతర అవకాశాలపై స్పందిస్తూ.. ప్రభుత్వమే నిర్ణయించాల్సి వుందని అన్నారు. అయితే భద్రతను పెంచడం, స్థానిక కాశ్మీరీలు సంతోషంగా, మనవైపు ఉన్నారని నిర్థారించుకోవడం ద్వారా దాడులను ఎదుర్కొవచ్చని అన్నారు. పుల్వామా ఉగ్రదాడి నిందితులను శిక్షించాలన్న ప్రధాని వ్యాఖ్యలతో ఏకీభవిస్తానని అన్నారు.

కాశ్మీరీయులంతా ఒక్కటేనని, పహల్గాం ఘటన తర్వాత స్థానిక కాశ్మీరీలపై దాడులు సరికాదని అన్నారు. కాశ్మీరీయుల నివాసాలను కూల్చివేయడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. స్థానికులను లక్ష్యంగా చేసుకోకూడదని కాశ్మీర్‌ సిఎం ఒమర్‌ అబ్దుల్లా సహా పలువురు నేతలు ప్రకటనలు కూడా ఇచ్చారని అన్నారు. కాశ్మీరీయుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా, జమ్ముకాశ్మీర్‌ రాష్ట్రహోదాను పునరుద్ధరించడానికి ఇదే మంచి సమయమని అన్నారు. ఇటీవల దాడులు పెరిగాయని అన్నారు. రాజౌరీ, పూంచ్‌, జమ్ము నుండి ఇటీవల ఉదంపూర్‌లో సైనికులపై దాడులు జరిగాయని అన్నారు. ఉదంపూర్‌ నుండి పహల్గాం చేరుకునే మార్గం ప్రారంభమవుతుందని అన్నారు. అంటే జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదం తొలగిపోలేదని, కాశ్మీర్‌లో పర్యాటకం సాధారణ స్థితికి చేరుకోలేదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img