వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్
నవతెలంగాణ – భూపాలపల్లి
జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌లో విద్యార్థిని కొట్టిన ఘటనపై వార్డెన్ ను సస్పెండ్ చేసి పోలీస్ కేసు నమోదు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్సి హాస్టల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖీ అయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డిగ్రీ చదువుతున్న హాస్టల్ విద్యార్థిని కొట్టడం చాలా బాధాకరమని, తక్షణమే ఎస్సి అభివృద్ధి అధికారి ద్వారా విచారణ నిర్వహించి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. హాస్టల్‌లో జరిగిన ఈ ఘటనపై ప్రాథమిక విచారణ అనంతరం, విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు మరియు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు వార్డెన్‌ను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. బాధ్యురాలిపై శాఖాపరమైన చర్యలే కాకుండా, క్రిమినల్ కేసు కూడా నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సంక్షేమ అధికారిని ఈ ఘటనపై ప్రత్యేక విచారణాధికారిగా నియమించామని, ఇప్పటికే హాస్టల్‌ను సందర్శించి, విద్యార్థినులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించామన్నారు. బాధిత విద్యార్థినికి మరియు హాస్టల్‌లోని ఇతర విద్యార్థినులకు తగిన కౌన్సెలింగ్ ఇచ్చి, వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. హాస్టల్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ హాస్టళ్లు మరియు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు.
విద్యార్థుల భద్రత ప్రధమ ప్రాధాన్యతని, చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్ట పరంగా కఠినంగా శిక్షించబడతారని ఆయన స్పష్టం చేశారు. హాస్టల్ లో ప్రవేశించిన వ్యక్తి ఎవరు అనేది విచారణ జరుగుతున్నదని, విచారణ నివేదిక రాగానే సంబంధిత వ్యక్తిపై పోలీస్ కేసు నమోదుతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎస్సీ అభివృద్ధి అధికారి ఇందిర, సంక్షేమ అధికారి మల్లేశ్వరి, డీఈఓ రాజేందర్, ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.



