నవతెలంగాణ – కామారెడ్డి : ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో అధికారులు, ఉద్యోగులు కలిసి “నీటి సంరక్షణ ప్రతిజ్ఞ” చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది నీటిని సంరక్షించేందుకు, పొదుపుగా వినియోగించేందుకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. నీటిని వృథా చేయకుండా ఒక్క బొట్టు కూడా వృథా కాకుండా చూసుకోవాలని, తమ కుటుంబ సభ్యులలో కూడా నీటి వినియోగంపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. అలాగే నీటిని అత్యంత విలువైన సహజ వనరుగా భావిస్తూ, సమర్థంగా వినియోగించాల్సిన బాధ్యత తమదేనని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, ప్రపంచ నీటి దినోత్సవం ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భూమినీ, భవిష్యత్ తరాల కోసం నీటిని రక్షించుకోవడం అత్యంత అవసరమని, నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ( లోకల్ బాడీస్ ) మధుమోహన్, జిల్లా పరిషత్ సీఈఓ చందర్, ఆర్డీవో వీణ, భూగర్భ జల శాఖ అధికారి సతీష్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.



