నవతెలంగాణ-హైదరాబాద్ : ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఫలితంగా శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం డ్యాంకు 1,71,550 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 880.80 అడుగుల వరకు చేరింది. జలాశయ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ఇప్పటికే 192 టీఎంసీల నీటితో కళకళలాడుతోంది. కొన్ని గంటల వ్యవధిలో పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నీటిని దిగువకు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ విషయాన్ని జలవనరులశాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు. అందుకు ఆయన తానే స్వయంగా వచ్చి నీటిని విడుదల చేస్తానని చెప్పడంతో సోమవారం మధ్యాహ్నం అప్పటికప్పుడు సీఎం శ్రీశైలం పర్యటన ఖరారు అయింది. మంగళవారం ఉదయం 11.50 గంటలకు కృష్ణమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇచ్చిన తర్వాత గేట్లు ఎత్తనున్నారు.
సాధారణంగా ఆగస్టు ఆఖరు నాటికి లేదంటే సెప్టెంబరులో గానీ శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తుతుంటారు. ఈ ఏడాది ఎగువన జూన్ నుంచి వర్షాలు సమృద్ధిగా కురవడంతో వరద ప్రవాహం భారీగా ఉంటోంది. జూన్ 1 నుంచి ప్రారంభమైన నీటి సంవత్సరంలో జులై 5 వరకు శ్రీశైలం జలాశయంలోకి 125 టీఎంసీల ప్రవాహం వచ్చింది. గత 15 ఏళ్ల సగటు.. ఈ కాలవ్యవధికి 12.26 టీఎంసీలే. దాంతో ఎప్పుడూ లేనట్లు జులై తొలి వారంలోనే శ్రీశైలం నీటిని విడుదల చేయనున్నారు. గతేడాది జులై 30న గేట్లు ఎత్తగా, ప్రస్తుతం దానికి మూడు వారాల ముందే గేట్లు ఎత్తుతుండటం విశేషం. మరోపక్క పోతిరెడ్డిపాడు నుంచి 15 వేల క్యూసెక్కులను వెలుగోడు జలాశయానికి పంపుతున్నారు.