Sunday, May 11, 2025
Homeఆటలుఅల దక్షిణాదిలో..?

అల దక్షిణాదిలో..?

- Advertisement -


– వేదికలుగా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూర్‌
– ఐపీఎల్‌18కు బీసీసీఐ ప్లాన్‌-బి సిద్ధం

సరిహద్దు ఉద్రిక్తతలు సద్దుమణిగాయి. భారత్‌, పాకిస్థాన్‌ కాల్పుల విరమణకు అంగీకరించాయి. యుద్ధ వాతావరణం నేపథ్యంలో అర్థాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్‌ 2025ను మళ్లీ పున ప్రారంభించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ప్లే ఆఫ్స్‌ సహా 12 గ్రూప్‌ దశ మ్యాచ్‌ల నిర్వహణకు దక్షిణాది నగరాలను ఎంచుకుంది. మరో పది రోజుల్లో ఐపీఎల్‌18 మళ్లీ పట్టాలెక్కితే.. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూర్‌లు 16 మ్యాచులకు వేదికగా నిలువనున్నాయి.
నవతెలంగాణ-ముంబయి

సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెరపడింది. ఇక స్టేడియంలో ఉత్కంఠకు తెరతీయాల్సిన సమయం ఆసన్నమైంది. యుద్ధ వాతావరణ పరిస్థితులతో ఐపీఎల్‌18ను వారం రోజుల వాయిదా వేయగా.. తాజాగా భారత్‌, పాకిస్థాన్‌ కాల్పుల విరమణతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పున ప్రారంభంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) దృష్టి సారించింది. జూన్‌ 11 నుంచి ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఉండటంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెటర్లు అందుబాటులో ఉండటం కష్టమవనుంది. జూన్‌ 20 నుంచి భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌ షురూ కానుండటంతో.. ఐపీఎల్‌18ను ముగించేందుకు మే నెలాఖరే మంచి తరుణం. ఐపీఎల్‌18లో గ్రూప్‌ దశలో 12 మ్యాచులు, ప్లే ఆఫ్స్‌ మ్యాచులను హైదరాబాద్‌, చెన్నై, బెంగళూర్‌లో నిర్వహించే ప్లాన్‌-బి అమలు చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.
మూడు నగరాల్లోనే
ఈ నెలాఖరులోగా ఐపీఎల్‌18 పున ప్రారంభమైతే.. దక్షిణాది నగరాలు 16 మ్యాచులకు వేదికగా నిలువనున్నాయి. లాజిస్టికల్‌ సమస్యలకు చెక్‌ పెట్టడంతో పాటు ఆటగాళ్లపై ప్రయాణ ఒత్తిడిని తగ్గించేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే మూడు నగరాలను ఎంపిక చేసినట్టు సమాచారం. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూర్‌ వేదికగా మిగిలిన 16 మ్యాచులను నిర్వహించాలని బోర్డు ప్రణాళిక. వాస్తవానికి, 12 గ్రూప్‌ దశ మ్యాచులను ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, చెన్నై, జైపూర్‌, బెంగళూర్‌ సహా ముంబయిలో షెడ్యూల్‌ చేశారు. కానీ ఐపీఎల్‌ను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ బోర్డు నిర్ణయం తీసుకోగా.. తక్కువ సమయంలో లీగ్‌ను ముగించాల్సి రావటంతో రెగ్యులర్‌ ఫార్మాట్‌లో కాకుండా మూడు నగరాలకు మాత్రమే పరిమితం చేయనున్నారు. హైదరాబాద్‌, కోల్‌కతలు ప్లే ఆఫ్స్‌కు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోల్‌కతలో క్వాలిఫయర్‌2, ఫైనల్‌ జరిగే అవకాశాలు కనిపించటం లేదు.
ఇప్పుడు సాధ్యమేనా?
ఐపీఎల్‌18ను మరో పది రోజుల్లో పున ప్రారంభించటంలో బీసీసీఐ విఫలమైతే.. మిగిలిన 16 మ్యాచుల కోసం ఆగస్టు-సెప్టెంబర్‌ వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అప్పుడు కూడా విదేశీ క్రికెటర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటం అనుమానమే. జూన్‌ 20 నుంచి భారత్‌, ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌ ఆరంభం కానుండగా.. ఆగస్టు వరకు టీమ్‌ ఇండియా షెడ్యూల్‌ బిజీగా ఉంది. ఆగస్టులో బంగ్లాదేశ్‌ పర్యటన, సెప్టెంబర్‌లో ఆసియా కప్‌ ఉన్నాయి. ఈ రెండింటి స్థానంలో ఐపీఎల్‌ నిర్వహణకు బోర్డు మొగ్గుచూపవచ్చు. అక్టోబర్‌, నవంబర్‌లోనూ ఇంటా, బయటా భారత్‌ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనుంది. మే 9న ఐపీఎల్‌ను వారం పాటు వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోగా.. మే 10 సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. లీగ్‌ పున ప్రారంభం, రీ షెడ్యూల్‌, వేదికల మార్పు వంటి అంశాలపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చేందుకు బోర్డుకు తగినంత సమయం ఉంది. మరి బీసీసీఐ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఆ మ్యాచ్‌ మళ్లీ ఆడతారా?
ఐపీఎల్‌18 గ్రూప్‌ దశలో 57 మ్యాచులు ముగిశాయి. 58వ మ్యాచ్‌ ధర్మశాల వేదికగా పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడ్డాయి. 10.1 ఓవర్లలోనే మ్యాచ్‌ను అర్థాంతరంగా నిలిపివేశారు. అభిమానులను, క్రికెటర్లను స్టేడియం నుంచి సురక్షితంగా బయటకు పంపించారు. క్రికెటేతర అంశాలతో మ్యాచ్‌ నిలిచిపోవటంతో.. పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ను మళ్లీ నిర్వహిస్తారా? లేదా ఇరు జట్లకు చెరో పాయింట్‌తో సరిపెడతారా? అనేది అధికారికంగా తేలాల్సి ఉంది.
క్రికెటర్లు వెళ్లిపోయారు
ఓవైపు ఐపీఎల్‌18 పున ప్రారంభానికి ప్లాన్‌-బిపై బీసీసీఐ కసరత్తు చేస్తుండగా.. మరోవైపు విదేశీ క్రికెటర్లు స్వదేశానికి వెళ్లిపోయారు. శనివారం సాయంత్రానికే దాదాపుగా విదేశీ క్రికెటర్లు అందుబాటులోని విమానంలో వెళ్లిపోయారు. వారం రోజుల వ్యవధిలో మళ్లీ రప్పించటం బీసీసీఐ, ప్రాంఛైజీల పరిధిలో ఉన్న అంశం. కొందరు నేరుగా భారత్‌ నుంచే స్వదేశాలకు చేరుకోగా.. మరికొందరు దుబారుకి చేరుకుని అక్కడ్నుంచి సొంత నగరాల్లో అడుగుపెట్టేందుకు చూస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -