Friday, May 9, 2025
Homeరాష్ట్రీయంఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం

ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం

- Advertisement -

– సన్నబియ్యం స్కీంకు కేంద్రం ఏమీ ఇవ్వట్లే
– ఈ పథకం చరిత్రాత్మకం… 99 శాతం మంది బియ్యాన్ని తింటున్నారు
– ‘ఆపరేషన్‌ సిందూర్‌’తో తెలంగాణ కోర్‌ కమిటీ వాయిదా : ఢిల్లీలో మీడియాతో మంత్రి ఉత్తమ్‌ చిట్‌ చాట్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

కొద్దిమంది ఎంత శ్రమించిన కాలం కలిసిరాదని, అయితే కేసీఆర్‌ మాత్రం అదష్టం కొద్ది సీఎం అయ్యారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక గడ్డం తీసుకుంటానని చెప్పానని, అయితే ప్రస్తుతం ఆ గడ్డం తనకు కంఫర్టబుల్‌గా ఉందని అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కాసేపు మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు వాస్తవాలు తెలపాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా… ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చుతోందన్నారు. రుణమాఫీ, ఇతర ఆరు గ్యారెంటీల అమలుతో తెలంగాణలో 70 శాతం ప్రజలు ప్రభుత్వం పై సంతప్తిగా ఉన్నారని తెలిపారు.
సన్నబియ్యం స్కీంకు కేంద్రం ఏమీ ఇవ్వట్లే ..
దేశ చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి ఉత్తమ్‌ వివరించారు. ఈ స్కీంకోసం కేంద్రం అందిస్తోన్న సహకారం ఏమీ లేదన్నారు. తెలంగాణలోని లో పావర్టీ లైన్‌(బీపీఎల్‌) కుటుంబాలకు మాత్రమే కేంద్రం బియ్యం ఇస్తుందని చెప్పారు. అది కూడా కేవలం 5 కిలోలు మాత్రమేనని తెలిపారు. నిజంగా కేంద్రమే అంతా భరిస్తే… బీజేపీ పాలిత ప్రాంతాల్లో సన్నబియ్యం స్కీం ఎందుకు లేదని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే బియ్యంతో రిసైక్లింగ్‌ జరుగుతోందని తెలిసినా… మోడీ సర్కార్‌ మొక్కుబడిగా బియ్యం ఇస్తోందని విమర్శించారు. అయితే తెలంగాణలో పండిన సన్నబియాన్నే ప్రజలకు అందజేస్తున్నట్టు తెలిపారు. తద్వారా బ్లాక్‌ మార్కెట్‌, రీసైక్లింగ్‌ మాఫియాను 95శాతం అరికట్టామన్నారు. దాదాపు 99 శాతం మంది ప్రజలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సన్నబియాన్నే తింటున్నారన్నారు. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేని సంక్షేమ పథకం అని కితాబిచ్చారు.
తెలంగాణ కోర్‌ కమిటీ వాయిదా
తెలంగాణ కోర్‌ కమిటీ మీటింగ్‌లో భాగంగా ఆయన ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. అయితే ‘ఆపరేషన్‌ సిందూర్‌’ కారణంగా పార్టీ నేషనల్‌ జనరల్‌ సెక్రెటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌ నేతత్వంలో జరగాల్సిన భేటీ వాయిదా పడిందని తెలిపారు. ఈ భేటీలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై చర్చ జరగాల్సి ఉందన్నారు. తెలంగాణలో క్యాబినెట్‌ విస్తరణ ఎప్పుడు ఉంటుందనేది అధిష్టానం నిర్ణయిస్తుందని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -