ప్రస్తుతం ఎన్నో రంగాల్లో మహళలు తమ సత్తా చాటుకుంటున్నారు. తాము లేని రంగమంటూ లేదని నిరూపించుకుంటున్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా సవాళ్లుగా స్వీకరించి ముందడుగు వేస్తున్నారు. అయితే రజనీ పండిట్ సమస్యల పరిష్కారమే తన కెరీర్‌గా ఎంచుకున్నారు. సాధారణంగా డిటెక్టివ్ రంగంలో మహిళల సంఖ్య చాలా తక్కువ. కాలేజీలో ఉన్నప్పుడు అనుకోకుండా ఈ వృత్తిలోకి ప్రవేశించారు. 1980ల ప్రారంభంలో డిటెక్టివ్‌గా మారారు. మొట్టమొదటి మహిళా డిటెక్టివ్‌గా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఈ రంగంలో ఈమెకు 30 ఏండ్లకు పైగా అనుభవం ఉంది. సుమారు 80,000 కేసులను పరిష్కరించిన ఆమె ఈ రంగంలోనూ ఎక్కువ మంది మహిళలు అవసరమంటూ ఎన్నో విషయాలు ఆమె ఓ వెబ్‌సెట్‌తో పంచుకున్నారు. ఆ విశేషాలు నేటి మానవిలో…
ప్రారంభంలో ‘ఈ అమ్మాయి తన సొంత వ్యాపారాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు’ అనే విషయాన్ని ఎక్కువమంది చర్చించేవారు. కానీ 80ల ప్రారంభంలో అది ఆమెకు మంచి మలుపుగా తిరిగింది. విజయవంతమైన ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీకి పునాది వేసింది. ‘కాలేజీలో నాతో చదువుతున్న ఒక అమ్మాయి ప్రవర్తనను నేను నిశితంగా గమనించాను. ఆమె ధూమపానం, మద్యపానం చేస్తూ తరగతులకు రాకుండా చెడు సహవాసంలో ఉండేది. నేను కాలేజీ ఆఫీసు క్లర్క్ నుండి ఆమె అడ్రెస్ తీసుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్లి ఆమె గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పాను’ అని రజనీ అప్పటి రోజులు గుర్తు చేసుకున్నారు.
కాలేజీలోనే మొదలయింది
‘మీ అమ్మాయి జీవితం పట్ల ఆందోళనతో ఇలా మీ దగ్గరకు వచ్చాను, తన రహస్యాలను మీకు చెప్పడం కాస్త ఇబ్బందిగా ఉంది’ అంటూ ఆమె ఆ తల్లిదండ్రులతో అన్నారు. అయితే రజనీకి వాళ్లు కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో ఆమె బుర్ఖా ధరించి ఒక వ్యక్తిని అనుసరించిన మరొక సంఘటనను కూడా గుర్తుచేసుకున్నారు. అతని భార్య వాళ్లకు వ్యాపారంలో నిత్య నష్టం వస్తుందని మాకు ఫిర్యాదు చేసింది. ‘అతను విపరీతంగా మద్యం తాగడం, జూదం ఆడటాన్ని నేను గమనించాను. కానీ ఇంటికి వచ్చి వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయని భార్యకు చెప్పేవాడు. నేను ఆమెకు అసలు నిజం చెప్పిన తర్వాత వ్యాపారాన్ని ఆమె చూసుకోవడం మొదలుపెట్టింది. అంతేకాదు వ్యాపారాన్ని బాగు చేయడం ప్రారంభించింది. ఆ కుటుంబం పేదరికం నుండి బయటపడింది’ అంటూ రజనీ పంచుకున్నారు.
ఎన్నో కేసులు పరిష్కరించారు
వివాహమైన వెంటనే తన భర్త గురించి ఒక అనామక లేఖను అందుకున్న ఒక మహిళకు సంబంధించిన ఒక కేసును పరిష్కరించిన విషయం తెలుసుకున్న తర్వాత కీర్తి రజనీకి కాల్ చేసింది. వెంటనే రజనీ ఆమె గ్రామానికి వెళ్లి, అతనికి మరో కుటుంబం ఉన్నట్టు గుర్తించారు. అలాగే ఎవ్వరూ ఇంట్లో లేనపుడు కొడుకే డూప్లికేట్ కీతో లోపలికి ప్రవేశించి, ఇంట్లో ఖరీదైన వస్తువులను తన స్నేహితుల సహాయంతో దొంగలిస్తున్న ఇంటి దొంగ కేసును కూడా ఆమె పరిష్కరించారు.
మేమేం తక్కువ కాదు
రజనీ గురించి పత్రికల వాళ్లు విపరీతంగా రాయడం మొదలుపెట్టారు. దాంతో ఆమె గురించిన వార్తలు విస్తృతంగా వ్యాపించాయి. ఆమెను ‘లేడీ షెర్లాక్”, ‘లేడీ జేమ్స్ బాండ్’ అని పిలిచేవారు. అయితే ఆ వ్యక్తులు ఎవరో ఆమెకు తెలియలేదు. ‘వారు ప్రసిద్ధ కల్పిత డిటెక్టివ్‌లు అని అర్థం చేసుకోవడానికి నేను వారి గురించి చదవవలసి వచ్చింది’ అంటూ ఆమె నవ్వుతూ చెప్పారు. 1989 నాటికి ఆమె అందరికీ తెలిసిన వ్యక్తి. ‘హమ్ కిసీ సే కమ్ నహిన్’ షోలో దూరదర్శన్‌కి రజనీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇది ఆమెకు దేశం నలుమూలల నుండి కీర్తిని తెచ్చిపెట్టింది. అంతేకాదు అప్పటి నుండి కేసులు వెల్లువలా వచ్చిపడ్డాయి.
కష్టతరమైన కేసులు
ముంబైలోని శివాజీ పార్క్‌లో రజనీ డిటెక్టివ్ ఏజెన్సీ కార్యాలయాన్ని స్థాపించారు. ప్రారంభంలో ఆమెకు ఎలాంటి కేసులు తీసుకోవాలో, ఎంత వసూలు చేయాలో తెలియదు. ‘అనుభవ్ హీ మేరా భగవాన్ హై (అనుభవమే నా దేవుడు)’ అని ఆమె చెప్పారు. ఆమె తన సొంత ఆలోచనలతో ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తూ, తన కెరీర్‌ను నిర్వహిస్తూ నేర్చుకున్నట్టు చెప్పారు. తాను పరిష్కరించిన కష్టతరమైన కేసులలో ఒకదాన్ని గురించి చెబుతూ తన భర్తే, కొడుకును హత్య చేసినట్టు అనుమానించిన ఒక మహిళకు సహాయం చేసేందుకు ఆమె ఇంటికి రజనీ రహస్యంగా వెళ్ళవలసి వచ్చింది. ఆ కేసుకోసం విభిన్న పాత్రలు పోషించారు. రెండేండ్ల పాటు ఒంటరి పోరాటమే చేశారు. ప్రస్తుతం ఆమెతో 20 మంది ఉన్నారు. రజనీ పనిలో బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లు, ఆర్థిక మోసం, ఉద్యోగానికి ముందు, తర్వాత తనిఖీలు, వ్యక్తిగత విచారణ (తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడం, విడాకుల కేసులు) ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇన్ని కేసులు పరిష్కరించే సమయంలో ‘మీ ఆత్మరక్షణ విషయంలో ఏమైనా శిక్షణ తీసుకున్నారా’ అని అడిగితే ఆమె నవ్వుకున్నారు.
ఆమెను అరెస్టు చేశారు
‘మనుషులు తుపాకులతో తిరుగుతుంటే ఆత్మరక్షణ వల్ల ఉపయోగం ఏమిటి. నాకు మన్ కి హిమత్ (మనసుపై అత్యంత విశ్వాసం) ఉంది’ అని ఆమె చెప్పారు. ప్రైవేట్ డిటెక్టింగ్ అనేది భారతదేశంలో చాలా వరకు అసంఘటిత రంగం. దాన్ని కవర్ చేసే ప్రత్యేకత లేదు. కాల్ డేటాను ఆమె అక్రమంగా పొందారనే ఆరోపణతో 2018లో రజనీ అరెస్టయ్యారు. ‘నేను చాలా బాగా పని చేస్తున్నందుకు గుర్తింపుపొందాను’ అని ఆమె ఆ వివాదం గురించి చెప్పారు. ‘డిటెక్టివ్ అసోసియేషన్ ఉన్నప్పటికీ రక్షణ లేదు. సహాయం చేయడానికి ఎవరూ లేరని బాధపడను’ అంటారు ఆమె.
మహిళలు చాలా అవసరం
పోలీస్ డిపార్ట్‌మెంట్ నుండి జాబ్ ఆఫర్స్‌తో పాటు తనకు చాలా ఏండ్లుగా సమాజంలో గౌరవం లభించిందని రజనీ చెప్పారు. కానీ ఆమె తనంతట తానుగా పని చేయడంలోని థ్రిల్‌ని ఇష్టపడుతున్నారు. ఓర్పు, ఆత్మవిశ్వాసం, విచక్షణ, తెలివితేటలు, త్వరగా ఆలోచించడం అనేవి మంచి డిటెక్టివ్‌కి ఉండే ఐదు లక్షణాలు. ‘ఈ వృత్తిలో మాకు ఎక్కువ మంది మహిళలు అవసరం. మహిళలు వివేకం, ఏకాగ్రతతో మంచి డిటెక్టివ్‌లను తయారు చేస్తారు’ అంటూ ఆమె తన మాటలు ముగించారు.
మేమేం తక్కువేం కాదు..
- Advertisement -
- Advertisement -