నవతెలంగాణ-హైదరాబాద్: పెహల్గాం ఉగ్రదాడి ముష్కరులను హతం చేశామని హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ పై లోక్‌సభలో రెండో రోజు చర్చ కొనసాగుతోంది. ఈ చర్చ సందర్భంగా ఇవాళ షా మాట్లాడారు. పహల్గాం ప్రతీకారాన్ని ధృవీకరించారు. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ముగ్గురిని మట్టుబెట్టినట్లు వెల్లడించారు.
‘పహల్గాంలో పర్యాటకులను హత్య చేశారు. టూరిస్టులను ఉగ్రవాదులు అతికిరాతకంగా హత్య చేశారు. కుటుంబ సభ్యలు ముందే కాల్చి చంపారు. మతం పేరు అడిగి మరీ చంపడం దారుణం. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ముగ్గురిని హతమార్చం. ఈనెల 22న శాటిలైట్ ఫోన్ సిగ్నల్ ద్వారా ఉగ్రవాదుల కదలికలను గుర్తించాం. ఆపరేషన్ మహాదేవ్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రదాడి జరిగిన రోజునే జమ్ము భద్రతపై సమీక్షించాం. ఉగ్రవాదులను ఆశ్రయం ఇచ్చిన వారిని కూడా అరెస్ట్ చేశాం. ఉగ్రశిబిరాలను మట్టిలో కలిపేశాం. ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, జమ్ము పోలీసులకు అభినందనలు’ అని అమిత్ షా తెలిపారు. ఉగ్రవాదుల్ని హతమార్చాం అంటే విపక్షాలు సంతోషిస్తాయనుకున్నానని, కానీ సందేహాలు వ్యక్తం చేస్తున్నారంటూ షా వ్యాఖ్యానించారు.
జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ సమీపంలో ఉన్న హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో గడిచిన నెలరోజులుగా ఆ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో దాచిగామ్ నేషనల్ పార్క్ పరిసరాల్లో ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించిన భద్రతాదళాలు.. మెరుపు వేగంతో కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఉగ్రవాది సులేమాన్ షాతో పాటు పహల్గాం దాడికి కారణమైన మరో ఉగ్రవాది యాసిర్ హతమైనట్టు అధికారులు తెలిపారు.