అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియ
పట్టుదలతో మహాజాతరను విజయవంతం చేశాం
పూర్తికాని 5 శాతం పనులను వెంటనే పూర్తి చేయాలి
బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధి : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
నవతెలంగాణ -ములుగు
జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరిగిన మేడారం మహా జాతర విజయవంతం కావడానికి అందరం పట్టుదలతో పనిచేశామని, మేడారంలో భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయం నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ములుగు జిల్లా ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయానికి హెలికాప్టర్‌లో చేరుకున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అనసూయ సీతక్కకు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, డీఎఫ్‌ఓ రాహూల్ కిషన్ జాదవ్ పుష్ప గుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మేడారం దేవాలయం వద్ద పనులను మంత్రులు పరిశీలించారు. గద్దెల చుట్టూ రాతి నిర్మాణాన్ని, ఆలయ చుట్టూ ప్రాకారం, ప్రధాన ఆర్చీలు, ప్రహరీ సాండ్ స్టోన్ చిత్రాలు, చుట్టూ డ్రయినేజీ, గద్దెల చుట్టూ ఉన్న గ్రిల్స్, ఆలయ ఫ్లోరింగ్‌ను పరిశీలించారు. అనంతరం జంపన్న వాగు, హరిత, ఊరట్టం, చిలకల గుట్ట, ఆర్‌టీసీ జంక్షన్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా మేడారంలోని హరిత హోటల్‌లో సంబంధిత శాఖల ఉన్నత జిల్లా అధికారులతో మేడారం జాతర అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు.
2026 మేడారం మహా జాతర అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కృషి చేసిన అధికారులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రజా ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలిపారు. నాలుగు రోజులు పాటు జరిగిన మహా జాతరకు 1 కోటీ 55 లక్షల మంది భక్తులు వచ్చారన్నారు. 200 సంవత్సరాలు చెక్కుచెదరకుండా ఆలయం పునరుద్ధరణ చేశామని, భక్తుల రద్దీ కారణంగా మిగిలిన సూక్ష్మ పనులు కూడా వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. అలాగే జంపన్న వాగులో 365 రోజులు నీరు ఉండే విధంగా గోదావరి నది జలాలను వాగుకు మళ్ళించడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి, రహదారులకు ఇరువైపులా ప్లాంటేషన్ చేసేందుకు ప్రణాళికల సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న దేవాలయాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జాతర విజయవంతానికి తోడ్పడిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌తోపాటు ఇతర మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. జాతర అనంతరం మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పనులను నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సీహెచ్ మహేందర్, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ భానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మెన్ రేగ కళ్యాణి, ములుగు మున్సిపాలిటీ చైర్మెన్ చింతనిప్పుల చంద్రకళ, ఈఓ వీరస్వామి, పూజారులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
200 ఏండ్లు నిలిచేలా పనులు చేశాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



