Friday, July 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవ్యూహాత్మక స్థానాన్ని చైనాకు కోల్పోయాం

వ్యూహాత్మక స్థానాన్ని చైనాకు కోల్పోయాం

- Advertisement -

– ట్రంప్‌ విదేశాంగ విధానమే కారణం
– డెమొక్రాట్ల హెచ్చరిక
– ప్రపంచ దేశాలలో జిన్‌పింగ్‌కు ఆదరణ పెరుగుతోందన్న ప్యూ రిసెర్చ్‌
– పడిపోతున్న ట్రంప్‌ రేటింగ్‌
వాషింగ్టన్‌ :
అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న విదేశాంగ విధానం కారణంగా చైనా కంటే వెనుకబడిపోjయామని, వ్యూహాత్మక స్థానాన్ని కోల్పోయామని డెమొక్రాట్లు హెచ్చరించారు. ట్రంప్‌ ఆరు నెలల పాలనపై ప్రతిపక్ష డెమొక్రాట్లు ఓ నివేదికను విడుదల చేశారు. చైనాతో పోటీ పడే విషయంలో అమెరికా సామర్ధ్యాన్ని ట్రంప్‌ పాలన నాశనం చేసిందని ఆ నివేదికలో ఆరోపించారు. ‘అమెరికా విదేశాంగ శాఖలో సిబ్బందిని కుదించారు. వాయిస్‌ ఆఫ్‌ అమెరికా, రేడియో ఫ్రీ ఆసియాలను పర్యవేక్షించే యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ గ్లోబల్‌ మీడియాలో, సహాయ సంస్థ యుఎస్‌ ఎయిడ్‌లో కూడా గందరగోళం సృష్టించి వాటిని నిర్వీర్యం చేశారు. ఈ చర్యల కారణంగా అమెరికా శక్తి, ప్రభావం బలహీనపడ్డాయి’ అని ఆ నివేదిక తెలిపింది.

చైనాలో అమెరికా మిత్రుల పర్యటనలు
ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మిత్రదేశాలకు చెందిన పలువురు నేతలు చైనాలో పర్యటించడం మరో ఆసక్తికరమైన పరిణామం. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనేస్‌, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ సహా పలువురు నేతలు చైనాలో పర్యటించారు. ముఖ్యంగా వీరిద్దరూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు కూడా. ఈ సంవత్సరం ప్రారంభంలో సింగపూర్‌, న్యూజిలాండ్‌, స్పెయిన్‌ ప్రధానులు, బ్రెజిల్‌ అధ్యక్షుడు కూడా చైనా వెళ్లారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా త్వరలోనే చైనాలో పర్యటించబోతున్నారు.

చైనాకు పెరుగుతున్న సానుకూలత
డెమొక్రాట్లు విడుదల చేసిన నివేదికను నిశితంగా గమనిస్తే అది ప్రపంచ దేశాలలో చైనాకు అనుకూలంగా వ్యక్తమవుతున్న మార్పును సూచిస్తోంది. గత సంవత్సరంతో పోలిస్తే మెక్సికో, దక్షిణాఫ్రికా, తుర్కియే, కెన్యా, ఇండొనేషియా వంటి పదిహేను దేశాల ప్రజలు చైనా పట్ల తమ వైఖరిని మార్చుకున్నారని, సానుకూలంగా వ్యవహరిస్తున్నారని అమెరికాకు చెందిన ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించడం సముచితంగా ఉంటుంది. ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలలో చైనా కూడా ఒకటని, అది అమెరికా కంటే మెరుగైన స్థానంలోనే ఉన్నదని ప్యూ సెంటర్‌ తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో చైనా అగ్ర స్థానంలో ఉన్నదని గత సంవత్సరం 41 శాతం మంది అభిప్రాయపడగా ఆ స్థానం అమెరికాదేనని 39 శాతం మంది చెప్పారు. ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాలైన కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, ది నెదర్లాండ్స్‌, దక్షిణ కొరియా, స్పెయిన్‌, స్వీడన్‌, బ్రిటన్‌ ప్రజల వైఖరిలో మార్పు కన్పిస్తోంది.

వాషింగ్టన్‌ స్థానాన్ని బీజింగ్‌ భర్తీ చేస్తోంది
అమెరికా సెనెట్‌ విదేశీ సంబంధాల కమిటీలోని డెమొక్రటిక్‌ సభ్యులు రూపొందించిన ఈ నివేదిక ట్రంప్‌ విధానాలను ఎండగట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, పారిస్‌ వాతావరణ ఒప్పందం వంటి అంతర్జాతీయ ఇనిషియేటివ్స్‌ నుంచి ట్రంప్‌ వైదొలుగుతుండడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు చైనా ముందుకొస్తోందని ఆ నివేదిక తెలియజేసింది. ఇప్పుడు చైనా విదేశాలకు నిధులు అందిస్తోందని, దౌత్య యత్నాలను పెంచుకుంటోందని చెప్పింది. వాణిజ్య భాగస్వాములపై ట్రంప్‌ ప్రకటించిన సుంకాల యుద్ధం కారణంగా కూటములు, ఆర్థిక భాగస్వాములు తగ్గిపోతున్నారని వాపోయింది. అమెరికాతో సన్నిహితంగా ఉండే మిత్ర దేశాలు కూడా ఇప్పుడు చైనా వెంట నడుస్తున్నాయని ఆక్రోశించింది.

మసకబారుతున్న ట్రంప్‌ ప్రాభవం
ప్యూ సెంటర్‌ నిర్వహించిన సర్వేలో కేవలం 35 శాతం మంది మాత్రమే అమెరికా పట్ల సానుకూల వైఖరిని వ్యక్తపరిచారు. 2024లో నిర్వహించిన సర్వేలో ఇది 51 శాతంగా ఉండడం గమనార్హం. దక్షిణ కొరియా, జపాన్‌, ఆస్ట్రేలియా ప్రజలలో ఈ మార్పు రెండంకెల సంఖ్య వరకూ ఉన్నదని ప్యూ తెలిపింది. 2024లో సంపన్న దేశాలలో చైనా పట్ల 23 శాతం సానుకూలత కన్పిస్తే గత సంవత్సరం నాటికి అది 32 శాతానికి పెరిగింది. ఇక ఈ దేశాలలో అమెరికా అధ్యక్షుడిపై విశ్వాసం కూడా సన్నగిల్లిపోతోంది. 2024లో జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 53 శాతం మంది ఆయనకు మద్దతు తెలుపగా ట్రంప్‌ పాలనలో అది 22 శాతానికి పడిపోయింది. అదే సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పోలిస్తే ట్రంప్‌ రేటింగ్‌ కూడా స్వల్పంగా తగ్గింది. జిన్‌పింగ్‌ పట్ల 2024లో 17 శాతం సానుకూలత వ్యక్తం కాగా గత సంవత్సరం అది 24 శాతానికి పెరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -