Wednesday, September 17, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజల అందేలా చూడాలి …

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజల అందేలా చూడాలి …

- Advertisement -

రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి….

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికి అందేలా చూడాలని, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవము జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజా పాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులకు,  స్వాతంత్య్ర సమరయోధులు అందరికీ నా జోహార్లు తెలిపారు. 

బుధవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజాపాల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ  సెప్టెంబర్‌ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు, హైదరాబాద్‌ సంస్థానం భారత్‌ యూనియన్‌లో చేరి నేటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజా ప్రతినిధులు,  అధికారులు, అనధికారులు, పాత్రికేయులు,  ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్ధినీ, విద్యార్ధులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆనాడు జరిగిన ప్రజా పోరాటాలలో అప్పటి ఉమ్మడి నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించిందనారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి  రావి నారాయణ రెడ్డి , భీంరెడ్డి నర్సింహా రెడ్డి , బొమ్మగాని ధర్మభిక్షమ్‌ , ఆరుట్ల రామచంద్రరెడ్డి , బద్దం ఎల్లారెడ్డి ,జిట్ట రామచంద్రరెడ్డి , ఆరుట్ల కమలమ్మ , కట్కూరి రామచంద్రారెడ్డి , సుశీల దేవి , సుద్దాల హనుమంతు, బొందుగుల నారాయణ రెడ్డి , కుర్రారం రాంరెడ్డి , గడ్డమీది రామయ్య, గుత్తా సీతారాంరెడ్డి , కొండవీటి గురునాథ రెడ్డి , ఎర్రబోతు రాంరెడ్డి,   కోదాటి నారాయణరావు ఇంకా ఎందరో త్యాగధనులు తెలంగాణలో స్వాతంత్రోద్యమాన్ని ప్రభావితం చేశారు. రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొదటిసారి అసువులు బాసిన  దొడ్డి కొమురయ్య  స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైనది. 

ఆనాటి పోరాటంలో ప్రజలను చైతన్య పరచడంలో తెలంగాణ మహిళలైన చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం , ఆరుట్ల కమలా దేవి  కీలక పాత్ర పోషించారు.  నల్లగొండ జిల్లా నుంచి బండి యాదగిరి రాసిన ‘‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లో పోతావు కొడుకో.. నైజాం సర్కారోడో…’’ పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసి రాచరిక ప్రభుత్వం పై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం రగిలించింది.  ప్రపంచ పోరాటాల చరిత్రలో తెలంగాణా సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందనారు. 

భూస్వామ్య జమీందార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అప్పటి నల్లగొండ జిల్లాలోని గుండ్రాంపల్లి, కడవెండి, రావులపెంట ప్రాంతాలు ఉద్యమానికి కేంద్ర బిందువులుగా నిలిచాయనీ , 1948 ఆగష్టు 27న జరిగిన భైరాన్‌ పల్లి కాల్పుల సంఘటన మరవరానిది. ఆ తరువాత 21 రోజులలోనే హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో చేరిందనారు. 

మరోవైపు హైదరాబాద్‌ సంస్థానం భారతదేశం భూభాగం మధ్యలో ఉండటం భవిష్యత్‌ లో సమస్యలకు దారి తీస్తుంది అని భారత ప్రభుత్వం భావించిందనీ, మరోవైపు ప్రజలపై రజాకార్లు, జమీందార్ల దాడులు పెరిగిన నేపథ్యంలో అప్పటి ప్రధానమంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, హోంమంత్రి  సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ , హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయాలని నిజాంకు రాయబారం పంపారు.

తమ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసేందుకు నిజాం అంగీకరించకపోవడంతో 1948 సెప్టెంబర్‌ 13న భారత సైన్యం రంగంలోకి దిగింది. దీనినే ఆపరేషన్‌ పోలో అని పిలిచారు. ఓవైపు సాయుధ పోరాటం, మరోవైపు భారత సైన్యం రంగంలోకి దిగడంతో చేసేదేమిలేక అప్పటి నిజాం భారత యూనియన్‌ లో విలీనానికి అంగీకరించాడు. 1948 సెప్టెంబరు 17 సాయంత్రం డెక్కన్‌ రేడియోలో ఇండియన్‌ యూనియన్‌ లో చేరుతానని ప్రకటించారు. నిజాం లొంగుబాటు తో హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత దేశంలో కలపడం జరిగిందనారు. 

హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో కలిసినప్పటికీ ఆనాటి కొందరి నాయకుల ప్రోద్బలం ఫలితంగా 1953లో మద్రాసు నుండి విడిపోయి మూడు సంవత్సరాల వరకు కర్నూలు రాజధానిగా చేసుకొని ఉన్న ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ ప్రాంతాన్ని బలవంతంగా కలపటానికి చేసిన నిర్ణయాన్ని ప్రముఖ తెలంగాణ నాయకులు వ్యతిరేకించినప్పటికి భాషాప్రయుక్త రాష్ట్రాల పేరుతో 1956లో ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేశారు. కాలక్రమేణా ఆంధ్ర పాలకుల నిర్ణయాలకు వ్యతిరేకంగా తెలంగాణలో 1969లో ప్రారంభమయిన తొలిదశ ఉద్యమంలో సుమారు 350 మంది అసువులు బాసినారు.   ఆ తరువాత మలిదశ ఉద్యమంలో సుమారు 1100 మంది అమరులు అయినారు. 

1969లో మొదలైన ఉద్యమం సుదీర్ఘకాలం కొనసాగి ఎంతోమంది అమరవీరుల ప్రాణత్యాగాల అనంతరం, తెలంగాణ మలి ఉద్యమం నీళ్ళు, నిధులు, నియామకాలు అనే ఆత్మగౌరవ నినాదాలతో 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసుకుంది. తెలంగాణ సాధన తరువాత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అన్ని రంగాలలో రాష్ట్రo ప్రగతి పధంలో శరవేగంగా అభివృది చెందుతూ, దేశం లోనే తలమానికంగా  ఉందన్నారు. జిల్లాలోని 5 నియోజికవర్గాలలో 9 వేల 517 లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు, రైతుభరోసా పథకం,  రైతు బీమా, మహాలక్ష్మి, గృహలక్ష్మి పథకాలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. విద్యార్థినీ విద్యార్థులచే ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు.  తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబ సభ్యులను సత్కరించారు.

ఈ కార్యక్రమం లో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంత రావు, డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ అక్షాoష్ యాదవ్, ఏసీపీ రాహుల్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది, పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -