సమిష్టిగా ఉండి… సమస్యలపై పోరాడాలి
ఇండ్ల స్థలాలు ఇండ్లు సాధించుకోవాలి
జర్నలిస్టుల సంక్షేమమే టీడబ్ల్యూజే ఎఫ్ ప్రధాన లక్ష్యం
రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్
నవతెలంగాణ-భూపాలపల్లి
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఉద్యమించాలనీ, సమిష్టిగా ఉండి… సమస్యలపై పోరాడి ఇండ్ల స్థలాలు, ఇండ్లు సాధించుకోవాలనీ,జర్నలిస్టుల సంక్షేమమే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన లక్ష్యం అని ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బొక్క దయాసాగర్ అన్నారు.
సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) జిల్లా కార్యవర్గ సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఎర్రం సతీష్ కుమార్ అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటేశ్వర్లు తో కలిసి దయాసాగర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ….
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. జర్నలిస్టులకు జీతభత్యాలు లేకుండా 24 గంటలు నిద్రాహారాలు మాని ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ పనిచేస్తున్నారన్నారు. జర్నలిస్టులు ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదని , జర్నలిస్టు ఆరోగ్య భద్రత లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టులు మరణిస్తే వారి కుటుంబానికి మీడియా అకాడమీ నుండి కేవలం లక్ష రూపాయలు మాత్రమే అందించి చేతులు దులుపుకుంటున్నారని ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు . మృతిచెందిన జర్నలిస్టు భార్యకు కేవలం 3వేల పెన్షన్ అందిస్తున్నారని ఇకనుండి 5వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు జారీ చేసిన హెల్త్ కార్డులు పనిచేయకుండా పోయాయని పని ఒత్తిడి వలన అనేక మంది జర్నలిస్టులు అనారోగ్యం పాలవుతురనితెలిపారు.
జర్నలిస్టులతో పాటు వారి కుటుంబాల ఆరోగ్య పరిస్థితులు గాలిలో దీపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టుల కు ఆక్రిడిటేషన్ కార్డ్స్ అందించటం లో ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు. అర్హులైన జర్నలిస్టులకు నివేశ స్థలాలను సంబంధించి పాలసీ ప్రకటించి ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీడియా గడ్డు పరిస్థితులను అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన బాధ్యత జర్నలిస్టు యూనియన్ల భుజస్కందాలపై ఉందన్నారు. జర్నలిస్టు సమస్యల సాధన కోసం యూనియన్లకు అతీతంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని,రానున్న రోజులలో మీడియాస్థితిగతులు మరింత జటిలంగా మారనున్నాయని తెలిపారు. జర్నలిస్టుల హక్కులు సాధించేవరకు పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సభ్యులంతా సమన్వయంతో సమిష్టిగా ఉండాలని, జర్నలిస్టుల సమస్యలపై పోరాడాలని సూచించారు. జిల్లా కమిటీలలో ఉన్న బాధ్యులు, సభ్యులు యూనియన్ నియమ నిబంధనలకు లోబడి పని చేయాలని, అదే విధంగా బాధ్యతతో వ్యవహరించి స్థానిక జర్నలిస్టుల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. అందరూ ఐక్యతతో హక్కుల సాధనకు కృషి చేయాలని కోరారు. సమన్వయంతో పని చేసి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి గుజ్జ సారేశ్వరరావు,జాతీయ కౌన్సిల్ సభ్యులు కొలుగూరి సంజీవరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చింతల కుమార్ యాదవ్, గాదె రమేష్, కోశాధికారి మండల రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు ములకల లక్ష్మారెడ్డి, కొండ్ర రమేష్, జాయింట్ సెక్రటరీలు తూటిచెర్ల దుర్గయ్య, సుంకరి శ్రీధర్, సామల ధనుంజయ, తెలంగాణ బ్రాడ్ కాస్ట్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ప్రవీణ్ కుమార్, కార్యదర్శి బండి కమలాకర్, కోశాధికారి ఏనుగుల భాస్కర్, ఉపాధ్యక్షులు తిరుపతి, జిల్లా మీడియా కన్వీనర్ పుల్ల సృజన్, కార్యవర్గ సభ్యులు రహీం పాషా, నామాల రమేష్,మంద జోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.



