– మెజార్టీ ఇచ్చే కాటారం ప్రజల గోస మంత్రికి పట్టదా
– నాట్లు కాకముందే యూరియా కోసం తిప్పలు పడుతాండ్లు
– రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
నవతెలంగాణ – కాటారం
ఓట్లు వేసిన ప్రజలకు అండగా నిలిచి వారి ఆకలి తీర్చాల్సిన బాధ్యత నాయకుడిపై ఉంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. శుక్రవారం కాటారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట యూరియా కోసం క్యూలైన్‌లో నిల్చున్న రైతులను కలిసి వారితో మాట్లాడారు. రెండు మూడు రోజులుగా యూరియా కోసం లైన్‌లో నిల్చుంటున్నామని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలను, సమస్యలను ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు చెప్పినా స్పందించడం లేదన్నారు. ఇంత పెద్ద సమాజంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న వ్యవసాయకూలీలు, రైతులు, కార్మికులు మూడు ఓట్లు ఉన్న మీ కుటుంబాన్ని అనేక మార్లు ఆదరించి అవకాశం కల్పించినా మా గురించి ఆలోచన చేయడం లేదని చెప్తన్నా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
ఎప్పుడుఓట్లు వచ్చినా కాటారం మండల ప్రజలకు దుద్దిళ్ల కుటుంబానికి వేలలో మెజార్టీ ఇస్తున్నారని, మెజార్టీ ఇచ్చే కాటారం ప్రజల గోస మంత్రికి పట్టదా అని ఆయన ప్రశ్నించారు. అధికారం, మంత్రి పదవి వచ్చేందుకు కారణమైన కాటారం ప్రజల గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదన్నారు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడం మూలంగా ఇంకా పూర్తి స్థాయిలో వరి నాట్లు కాలేదని, ఈ సమయంలోనే రైతులు ఇలా క్యూలైన్‌లలో రోజుల తరబడి నిలబడితే నాట్లు పూర్తి అయితే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందోమంత్రి ఆలోచన చేయాలన్నారు. దేశంలో తమ కుటుంబానికే కోట్లు సంపాదించుకుని ప్రజలను గాలికివదిలేసే నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం మంథని ఎమ్మెల్యే అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సీజన్‌లో రైతులకు పచ్చిరొట్టే విత్తనాలు, పప్పు దినుసుల విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వం, మంథని ఎమ్మెల్యే స్పందించి వరినాట్లు పూర్తయే సమయానికి రైతులకు సరిపడా యూరియను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
ఓట్లేసినోళ్లకు అండగా ఉండాలి: మాజీ ఎమ్మెల్యే పుట్ట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES