– తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అనడం అర్ధరహితం
– తెలంగాణ బిల్లు ఆమోదంలో సోనియా, కేసీఆర్, సుష్మాస్వరాజ్ పాత్ర : శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
జనగణనలోనే కులగణన చేపట్టాలని కేంద్రం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో చిట్‌చాట్ చేశారు. వివిధ రాష్ట్రాల్లో సామాజిక నేపథ్యం కారణంగా కులాల రిజర్వేషన్ అమల్లో ఉందన్నారు. ఈ అంతరాన్ని ఎలా తొలగిస్తారో క్లారిటీ ఇవ్వాలన్నారు. ముందుగా కులగణన చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో తాడోపేడో తేల్చుకోవాలన్న అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తోందన్నారు. పాకిస్తాన్‌తో యుద్ధం కంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని కోరారు. పాకిస్తాన్ తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాదులు, వారి నాయకులను అప్పగించాలని డిమాండ్ చేశారు. 2014 పునర్విభజన చట్టంలో నియోజకవర్గాల పునర్విభజన అమలు చేస్తామని హామీనిచ్చారని, ఆ తర్వాత జమ్మూ కశ్మీర్‌లో చేసినా.. విభజన చట్టం ప్రకారం అవకాశం ఉన్నా తెలంగాణ, ఏపీలో ఇప్పటి వరకు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు.2026 కులగణన తరవాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పిందన్నారు.
తమకు ఇష్టమైన రాష్ట్రంలో ఒక తీరుగా.. ఇష్టం లేని రాష్ట్రంలో మరో తీరుగా కేంద్రం వైఖరి ఉందని విమర్శించారు. పదవులు, అధికారం ఎవరికీ శాశ్వతం కావన్నారు. చాలా సందర్భాల్లో ప్రజా ప్రతినిధులకు ప్రొటోకాల్ ఉల్లంఘన జరుగుతోందన్నారు. ప్రొటోకాల్ వివాదాలు తలెత్తకుండా చూసు కోవాలన్నారు. త్వరలోనే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి అవుతుం దన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం అర్ధరహితం అన్నారు. ఆనాడు తాను ఎంపీగా పార్లమెంట్‌లో ఉన్నప్పుడు.. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని స్వయంగా కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ పోరాటాన్ని కూడా కాదనలేమని, అనుకుని ప్రజలు పదేండ్లు అధికారాన్ని ఇచ్చారని అన్నారు. కానీ అందరి పోరాటాన్ని గుర్తించాలని కోరారు. తెలంగాణ బిల్లు ఆమోదంలో కేసీఆర్, సోనియాగాంధీ, సుష్మా స్వరాజ్ పాత్రలను కాదనలేమన్నారు.
జనగణనలోనే కులగణనను స్వాగతిస్తున్నాం
- Advertisement -
RELATED ARTICLES