నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని వీధి కుక్కలన్నింటిని తక్షణమే షెల్టర్లుకు పంపించాలని దేశ జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్.మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఘాటుగా హెచ్చరించిన విషయం తెలిసిందే. పిల్లల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని.. రేబిస్ బారిన పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
అయితే ఈ తీర్పును జంతు ప్రేమికులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాహుల్‌గాంధీ, మేనకా గాంధీ లాంటి సీనియర్ రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకించారు. తీర్పును పరిశీలించాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్. గవాయ్‌కు లేఖలు రాశారు. అంతేకాకుండా తీర్పు వెలువడిన గంటల వ్యవధిలో ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గరకు వచ్చి ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అయితే తాజాగా ఈ అంశంపై చీఫ్ జస్టిస్ గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీర్పును పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో గవాయ్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. బుధవారం ఉదయం ఈ అంశాన్ని గవాయ్ దృష్టికి తీసుకెళ్లడంతో పరిశీలిస్తామంటూ హామీ ఇచ్చారు.