– రాహుల్‌గాంధీ ఆలోచనను కేంద్రం అమలు చేస్తోంది
– దాన్ని స్వాగతిస్తున్నాం..
– తెలంగాణానే రోల్ మోడల్
– బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఇప్పటికే చేసిఉంటే ఈ మాట అనేవాళ్లం కాదు : సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
జనగణనతో పాటే కులగణన కూడా చేయాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. దీనికోసం కేంద్రానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి మంత్రులు లేదా అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చినా, లేదా మమ్మల్నే ఢిల్లీకి రమ్మన్నా ఈ విషయంలో వారికి సహకారాన్ని అందిస్తామని గురువారంనాడిక్కడి సీఎం నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. రాహుల్‌గాంధీ ఆలోచనల్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలోనే తెలంగాణలో కులగణనను సంపూర్ణ పారదర్శకంగా నిర్వహించామనీ, ఇదే కేంద్రానికి రోల్‌మోడల్‌గా నిలుస్తుందన్నారు. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇదే తరహా కులగణన చేపట్టి ఉంటే తాము ఈ మాట చెప్పేవాళ్లం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బీజేపీ నేతల పరిస్థితి కక్కలేక, మింగలేక అన్నట్టు ఉందనీ, అందుకే వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావట్లేదన్నారు. కేంద్రంలోని మోడీ మైనారిటీ సర్కార్‌ను 240 సీట్లకే పరిమితం చేయబట్టే, వారు రిజర్వేషన్లు, రాజ్యాంగ జోలికి వెళ్లే సాహసం చేయట్లేదనీ, ఈ విషయంలో తాము ప్రజలను అప్రమత్తం చేస్తే, అది ఫలించిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జనగణనతో పాటు కులగణన చేయాలనీ, 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేయాలని రాష్ట్ర అసెంబ్లీలో తమ ప్రభుత్వం తీర్మానం చేసిందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణనను ఎప్పుడు ప్రారంభించి, ఎప్పుడు ముగిస్తారో నిర్ణీత షెడ్యూల్‌ను ప్రకటించాలని కోరారు. విధివిధానాల ఖరారుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి, వాటిని పబ్లిక్ డొమైన్‌లో పెట్టి, ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని సూచించారు. కేంద్ర మంత్రుల కమిటీతో పాటు మేథావులు, పౌరసమాజ ప్రతినిధులను కూడా ఈ ప్రక్రియలో భాగస్వాముల్ని చేయాలని చెప్పారు. రాష్ట్రంలో కులగణనను పార్టీ కార్యక్రమంగా తాము చేపట్టలేదనీ, ప్రతిపక్షాలు, మేథావులు, పౌరసమాజం సహా అన్ని వర్గాలను దీనిలో భాగస్వాముల్ని చేశామన్నారు. 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేసి, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పారు. ఈ విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహాయ సహాకారాలు అందిస్తామని పునరుద్ఘాటించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
సీఎంకు అభినందనల వెల్లువ
జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో పలువురు ప్రజా ప్రతినిధులు అభినందించారు. రాష్ట్రంలో విజయవంతంగా కులగణన చేపట్టి, దేశానికి ఆదర్శంగా నిలిచారని ప్రససించారు. సీఎంను అభినందించిన వారిలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, మాజీ ఎంపీలు వీ హన్మంతరావు, అంజన్‌కుమార్ యాదవ్, మధు యాష్కీ, బీసీ సంఘాల నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ అభినందనలు అన్నీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి చెందుతాయనీ, ఆయన దిశానిర్దేశంలోనే రాష్ట్రంలో కులగణను విజయవంతంగా చేపట్టగలిగామని తెలిపారు.
కులగణనకు సహకరిస్తాం
- Advertisement -
RELATED ARTICLES