Wednesday, May 14, 2025
Homeజాతీయంఅమెరికాపై ప్రతీకార సుంకాలు విధిస్తాం

అమెరికాపై ప్రతీకార సుంకాలు విధిస్తాం

- Advertisement -

– డబ్ల్యూటీఓకు తెలియజేసిన భారత్‌
న్యూఢిల్లీ:
వాణిజ్య ఒప్పందంపై ఒకపక్క భారత్‌, అమెరికా చర్చలు జరుపుతున్న సమయంలో, అమెరికాపై ప్రతీకార సుంకాలు విధిస్తామని భారత్‌, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు తెలియచేయడంతో ఇరు దేశాల మధ్య తాజా ఉద్రిక్తతలు తలెత్తాయి. ఉక్కు, అల్యూమినియంలపై దిగుమతి సుంకాలను 25శాతం పెంచినందుకు ప్రతిగా అమెరికా నుండి దిగు మతయ్యే 760కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించాలని భావిస్తున్నట్టు భారత్‌ తెలియచేసింది. ఈ మేరకు డబ్ల్యుటిఓ ఒక ప్రకటన విడుదల చేసింది. డబ్ల్యూటీఓకు నోటిఫికేషన్‌ పంపిన 30 రోజుల్లోగా భారత్‌ ప్రతీకార చర్యలు ప్రారంభించవచ్చు, మే 9న భారత్‌ ఈ నోటిఫికేషన్‌ పంపింది. భారత ప్రతినిధి బృందం అభ్యర్ధన మేరకు ఆ కమ్యూనికేషన్‌ను అందరికీ పంపినట్లు డబ్ల్యూటీఓ తెలియచేసింది. తాజా పరిణామంతో అమెరికా, భారత్‌ల మధ్య తిరిగి ఘర్షణ నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై ఏప్రిల్‌లో చర్చలు జరుపుదామని భారత్‌ ప్రతిపాదించినా అమెరికా తిరస్కరించింది. ఈ అధిక టారిఫ్‌లను పరిరక్షణ చర్యలుగా భారత్‌ పేర్కొంటుండగా, కాదని అమెరికా వాదిస్తోంది. ఈ చర్యలను అమెరికా గుర్తించకపోయినా ఇవి పరిరక్షణ చర్యలేనని భారత్‌ తన కమ్యూనికేషన్‌లో డబ్ల్యూటీఓకు తెలియచేసింది. అగ్రిమెంట్‌ ఆన్‌ సేఫ్‌గార్డ్స్‌ (ఎఓఎస్‌) లోని 12.3 అధికరణ కింద అమెరికా చర్చలు జరపనందున ప్రతీకార చర్యలు తీసుకునే హక్కు భారత్‌కు వుందని పేర్కొంది. రాయితీలు, లేదా ఇతర బాధ్యతలను నిలుపుచేసేందుకు గల హక్కును భారత్‌ అట్టిపెట్టుకుందని కూడా తెలియచేసింది. దీని ప్రకారం అమెరికా నుండి వచ్చే ఉత్పత్తుల్లో ఎంపిక చేసిన వాటిపై రాయితీలను నిలిపివేయడం లేదా ఇతర బాధ్యతలు లేదా కర్తవ్యాలను చేపట్టకపోవడం వంటి చర్యలు వుంటాయని భారత్‌ తెలిపింది. రాయితీలు నిలుపుచేయడం వల్ల ఆయా ఉత్పత్తులపై సుంకాలు పెరుగుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -