నవతెలంగాణ-హైదరాబాద్: రష్యానుండి చమురు కొనుగోళ్లు నిలిపివేయకుంటే మీ ఆర్థిక వ్యవస్థలను విచ్చిన్నం చేస్తామని అమెరికా సెనెటర్ భారత్, చైనా, బ్రెజిల్‌లపై బెదిరింపులకు దిగారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో చమురు కొనుగోళ్లను ఆపకుంటే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్, చైనా సహా రష్యా వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలను విధిస్తారని రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహం సోమవారం జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చమురు సంబంధిత దిగుమతులపై 100శాతం సుంకం విధించాలని ట్రంప్ యంత్రాగం యోచిస్తోందని, ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌కి వ్యతిరేకంగా చేస్తోన్న ప్రచారానికి ఆజ్యం పోస్తోందని అన్నారు.
యుద్ధం కొనసాగడానికి మీరు చవకైన రష్యా చమురును కొనుగోలు చేస్తూ ఉంటే, మిమ్మల్ని విడదీస్తామని, మీ ఆర్థిక వ్యవస్థలను విచ్చిన్నం చేస్తామని ఆయన చైనా, భారత్, బ్రెజిల్‌లను బెదిరించారు. రష్యా ముడి చమురు ఎగుమతుల్లో ఈ మూడు దేశాలు సుమారు 80శాతం వాటా కలిగి ఉన్నాయని, ఇది రష్యా ‘యుద్ధ ప్రణాళిక’ను కొనసాగిస్తుందని ఆరోపించారు. మీరు ( భారత్, చైనా, బ్రెజిల్) చేస్తున్నది రక్తపాతమని, ఎవరైనా యుద్ధాన్ని విరమించేలా చేసే వరకు పుతిన్ యుద్ధాన్ని కొనసాగిస్తాడని పేర్కొన్నారు. తనకి చెందని దేశాలను ఆక్రమించుకోవాలని పుతిన్ భావిపస్తున్నాడని ఆరోపించారు. 90ల మధ్యలో ఉక్రెయిన్‌కు ఇచ్చిన వాగ్దానాన్ని పుతిన్ ఉల్లంఘించారని ఆరోపించారు.
భారత్, చైనా సహా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులపై 500శాతం సుంకాలు విధించాలని కోరుతూ గ్రాహం గతంలో ఒక బిల్లును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. రష్యా చమురు కొనుగోలుదారులపై 100 శాతం ద్వితీయ సుంకాలను విధిస్తామని ట్రంప్ బెదిరింపులకు దిగారు. రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే చైనా, భారత్, బ్రెజిల్‌లపై ఆంక్షలు విధిస్తామని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే హెచ్చరించారు.