Friday, May 9, 2025
Homeప్రధాన వార్తలుఉద్యోగుల సమస్యలు పరిశీలిస్తాం

ఉద్యోగుల సమస్యలు పరిశీలిస్తాం

- Advertisement -

– మంత్రివర్గ ఉపసంఘంతో చర్చిస్తాం
– అవసరమైతే మరోసారి సమావేశం
– ఆ తర్వాతే ప్రభుత్వానికి నివేదిక : ఉద్యోగ జేఏసీతో అధికారుల కమిటీ చైర్మెన్‌ నవీన్‌ మిట్టల్‌
– 57 డిమాండ్లను వివరించిన నాయకులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తామని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్‌ఏ, త్రిసభ్య కమిటీ చైర్మెన్‌ నవీన్‌ మిట్టల్‌ ఉద్యోగ జేఏసీ నేతలతో అన్నారు. అన్ని విషయాలనూ రాసుకున్నామనీ, వాటిపై అధికారుల కమిటీ పరిశీలిస్తుందన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘంతో ఈ అంశాలను చర్చిస్తామని చెప్పారు. అవసరమైతే ఉద్యోగ జేఏసీ నాయకులతో మరోసారి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐఏఎస్‌ అధికారులతో ఉన్నతస్థాయి త్రిసభ్య కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో తెలంగాణ ఉద్యోగ జేఏసీతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్‌ఏ, త్రిసభ్య కమిటీ చైర్మెన్‌ నవీన్‌ మిట్టల్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, సభ్యులు లోకేష్‌ కుమార్‌, ట్రాన్స్‌కో సీఎండీ, ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి, సభ్యులు కృష్ణ భాస్కర్‌ హాజరయ్యారు. ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు, కో చైర్మెన్లు చావ రవి, వంగ రవీందర్‌రెడ్డి, జి సదానందంగౌడ్‌, దేవరకొండ సైదులు, అడిషనల్‌ సెక్రెటరీ జనరల్‌ పుల్గం దామోదర్‌రెడ్డి, డిప్యూటీ సెక్రెటరీ జనరల్స్‌ ముజీబ్‌ హుస్సేన్‌, ఎ సత్యనారాయణ, నాయకులు బి శ్యామ్‌, కస్తూరి వెంకటేశ్వర్లు, మధుసూదన్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్‌, గోల్కొండ సతీశ్‌, స్థితప్రజ్ఞ, గౌతం, సత్యనారాయణరెడ్డి, రామకృష్ణగౌడ్‌, తిరుపతి, ఎం ఉపేందర్‌రెడ్డి, ఎంబీ కృష్ణయాదవ్‌, కటకం రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలను వివరించిన జేఏసీ నాయకులు
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ మారం జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు, కో చైర్మెన్‌ చావ రవితోపాటు ఇతర నాయకులు త్రిసభ్య కమిటీకి వివరించారు. 57 డిమాండ్లకు సంబంధించి కూలంకషంగా చెప్పారు. ఆర్థికపరమైనవి, ఆర్థికేతర సమస్యలను విడదీసి అధికారులకు వివరించారు. ముఖ్యంగా ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ-కుబేర్‌లో వివిధ రకాల
పెండింగ్‌ బిల్లులు సుమారు రూ.పది వేల కోట్లు ఉన్నాయనీ, వాటిని దశలవారీగా విడుదల చేయాలని కోరారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ-2003 వారికి కేంద్ర ప్రభుత్వ మెమో 754,755ను అమలు చేస్తూ వెంటనే ఓపీఎస్‌ను అమలు చేయాలని వివరించారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకుని 51 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించేలా చూడాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని వెంటనే పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. వేసవి కాలంలోనే ఉద్యోగుల సాధారణ బదిలీలకు అవకాశమివ్వాలని వివరించారు. ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులను కల్పించేందుకు డీపీసీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసు రూల్స్‌ను అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌/అధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 2.9 లక్షల మంది పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. గురుకులాలు, మోడల్‌ స్కూల్‌ టీచర్లకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలివ్వాలని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -