నవతెలంగాణ-హైదరాబాద్: పాక్-భారత్ మధ్య భీకరదాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఇండియా విదేశాంగ మంత్రి జై శంకర్ లతో వేర్వేరుగా ఫోన్ లో మాట్లాడారు. పరిస్థితులు మరింత తీవ్రతరం కాకముందే భారత్ తో తక్షణం చర్చలు జరపాలని పాకిస్థాన్ కు అమెరికా సూచనలు చేసింది. పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలను తగ్గించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని రూబియో పాక్‌కు సూచించారని విదేశాంగశాఖ తెలిపింది. ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు అవసరమైతే ఇరు దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వం చేస్తామని ప్రతిపాదించినట్లు వెల్లడించింది.
అదేవిధంగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తోనూ రూబియో ఫోన్‌లో మాట్లాడారు. భారత్- పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రూబియో సూచించారు. ఇరుదేశాల మధ్య వివాదాల ముగింపునకు చర్చలు జరపాలని, అందుకు అమెరికా పూర్తి సాయం అందిస్తుందని తెలిపారు. ఈ ఫోన్‌కాల్ విషయాన్ని జై శంకర్ స్వయంగా ధ్రువీకరించారు. ఈ సందర్భంగా భారత్ విధానం ఎప్పుడూ బాధ్యతాయుతంగానే ఉంటుందని స్పష్టం చేశారు. భారత్-పాక్‌లు సంయమనం పాటించాలని జీ7 దేశాలు పిలుపునిచ్చాయి. పహల్గాం ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.