Saturday, January 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరిటైర్మెంట్‌ అయినా అధికారులను వదిలిపెట్టం

రిటైర్మెంట్‌ అయినా అధికారులను వదిలిపెట్టం

- Advertisement -

పస్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి విచారిస్తాం
మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే
చట్టాన్ని అతిక్రమించే పోలీసులకు హరీశ్‌రావు హెచ్చరిక
రామగుండంలో సోలార్‌ పవర్‌ కుంభకోణం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రిటైర్మైంట్‌ అయినా వదిలిపెట్టబోమనీ, ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి విచారిస్తామంటూ చట్టాన్ని అతిక్రమించి పని చేసే అధికారులు, పోలీసులకు బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు హెచ్చరించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉదయం, తెలంగాణ భవన్‌ సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ సొంత డబ్బులతో, సొంత లాయర్లను పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వ్యాఖ్యానిం చారు. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్‌లో పెట్టి తమ మీద ప్రయోగిస్తున్నారని చెప్పారు. అధికారులు అన్యాయంగా, అక్రమంగా వ్యవహరిస్తే, ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఎవర్నీ వదిలి పెట్టే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్దంగా వ్యవహరించకపోయినా, తప్పుడు లీకులు ఇచ్చినా ఆ పోలీసులను వదిలి పెట్టబోమని హెచ్చరించారు. అంతకు అంత అనుభవిస్తారనీ, జాగ్రత్తగా ఆలోచించుకోవాలని సూచించారు. దావోస్‌ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చే డైరెక్షన్‌లో కాకుండా చట్ట ప్రకారం వ్యవహరించాలని కోరారు. తప్పుడు సూచనలు, తప్పుడు ఆదేశాలను పాటించి చట్టాన్ని అతిక్రమి స్తే దానికి అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ నేతలపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమని విమర్శించారు. తాము తప్పు చేయలేదనీ, ఎవరికీ భయపడేది లేదని చెప్పారు. సిట్‌ అంటే.. స్క్రిప్టెడ్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌గా రేవంత్‌రెడ్డి మార్చారని అన్నారు. తెలంగాణ సిరుల గని సింగరేణి నేడు సృజన్‌ గనిగా మారిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బామ్మర్ది సృజన్‌రెడ్డి కోసమే సింగరేణిలో భారీ కుంభకోణాలు జరుగుతు న్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా సోలార్‌ పవర్‌పై టెండర్లు కొనసాగుతున్నాయనీ, ఒక మెగావాట్‌ సోలార్‌ ఉత్పత్తి చేయడానికి రూ.350 కోట్లు అవుతుందని అన్నారు. సింగరేణిలో సోలార్‌ ప్లాంట్లు పెట్టి సోలార్‌ పవర్‌ ఉత్పత్తి చేసినందుకు ఒక మెగావాటుకు రూ.540 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి కాంట్రాక్టర్‌కు చెల్లించబోతున్నాయని చెప్పారు. రూ.540 కోట్ల ఈ టెండర్‌ను వారికి కావాల్సి నవారికి కట్టబెట్టారని అన్నారు. సింగరేణి దాదాపు రూ.200 కోట్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. సోలార్‌ పవర్‌ స్కామ్‌ రామగుండంలో జరిగిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ : మధుసూదనాచారి
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కనిపిస్తున్నదని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఇందిరాగాంధీ అరాచకం మరోసారి గుర్తుకొస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్‌ పాలన పాపాల పాలన అని విమర్శించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌గాంధీ, సోనియాగాంధీకి నోటీసులిస్తే వేధింపులంటే కేటీఆర్‌కు, హరీశ్‌రావుకు నోటీసులు వేధింపుల కిందికి రాదా?అని మాజీమంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. తుగ్లక్‌ రాజ్యంలో ఇష్టం వచ్చినట్టు పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ను వేధించడానికే సిట్‌ పేరుతో రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడు తున్నారని మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. దేశ, రాష్ట్ర భద్రత కోసం ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాల్సి వస్తుందని బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ చెప్పారు. గోప్యంగా ఉంచాల్సిన ఈ అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి బజారున పడేశారని అన్నారు. మంత్రుల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారనీ, సీఎంకు వారికి మధ్య సయోధ్య లేదన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు రాజకీయం బట్టబ యలైందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ అన్నారు. పాలనను ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ విమర్శించారు. దేశ భద్రత కోసమే ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తారని ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఎవరి పని అయిపోయిందో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామనీ, దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని మాజీ ఎంపీ బాల్క సుమన్‌ సవాల్‌ విసిరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -