మీకు అండగా ఉంటాం..

– పార్లమెంట్‌ ముట్టడికి సంఘీభావం
– మల్లయోధులకు మహిళా మహాపంచాయతీ మద్దతు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
నూతన పార్లమెంట్‌ ప్రారంభోత్సవం రోజున (ఈనెల 28న) రెజ్లర్లు తలపెట్టిన మహిళ మహా పంచాయతీకి మద్దతు కూడగడుతున్నారు. అందుకు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అక్కడి ప్రజలతో మాట్లాడి తమ పోరాటంలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తున్న ఆందోళన బుధవారం కూడా కొనసాగింది. ఈ ఆందోళన 31 రోజులు పూర్తి చేసుకుంది. మరోవైపు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, ప్రపంచంలో వివిధ దేశాల్లో రెజ్లర్లకు మద్దతు ఆందోళనలు జరుగుతున్నాయి. మే 28న ఉదయం 11 గంటల నుంచి కొత్త పార్లమెంట్‌ వద్ద కిసాన్‌ మహాపంచాయత్‌ నిర్వహించనున్నామని రెజ్లర్లు తెలిపారు.
మహాపంచాయత్‌ కోసం, ప్రజల మద్దతును క్రీడాకారులు సమీకరిస్తున్నారు. ఈ మహాపంచా యత్‌లో దేశప్రజలు, ముఖ్యంగా మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని న్యాయం చేయాలని క్రీడాకారులు పిలుపునిచ్చారు. ఒలింపిక్‌ విజేత సాక్షి మాలిక్‌ బుధవారం హిసార్‌, ఫతేహాబాద్‌ చేరుకున్నారు. మే 28న కొత్త పార్లమెంటు ముందు జరగనున్న మహిళా మహాపంచాయత్‌ నిర్వహణకు సాక్షి మాలిక్‌ మద్దతు కూడగడుతున్నారు. గురువారం ఖత్కర్‌ టోల్‌ జింద్‌లో జరిగిన మహాపంచాయత్‌లో రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌, బజరంగ్‌ పునియాలు పాల్గొనున్నారు.
నిష్పక్షపాతంగా విచారణ చేయడం లేదు : సాక్షి మాలిక్‌
సాక్షి మాలిక్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే 40 సీరియస్‌ కేసులు నమోదై, హత్య చేసినట్టు బహిరంగంగా ఒప్పుకున్న నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగి స్తోందన్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం చట్టాన్ని తుంగలో తొక్కుతోందని విమర్శించారు. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ సాధారణ వ్యక్తి అయితే, ఆయన ఈపాటికి కటకటాల వెనక్కి వెళ్లేవాడని అన్నారు. కానీ అధికార పార్టీకి చెందిన ఎంపీ కావడం వల్లే ఆయనకు ఫ్రీ హ్యాండ్‌ ఇస్తున్నారని విమర్శించారు. నిందితుడు బహిరంగంగా మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ దేశ పుత్రికల పరువు తీస్తున్నాడని, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయడం లేదని, అరెస్టూ చేయడం లేదని విమర్శించారు. ఈ పోరాటం ఏ ఒక్క కూతురిది కాదని, దేశంలోని ప్రతి కూతురి పోరాటంగా మారిందని అన్నారు. గురువారం రెజ్లర్ల ఆందోళనకు జాట్‌ మహాసభ రాజస్థాన్‌, సర్వ కర్మచారి సంఫ్‌ు ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌, నగర్‌ పాలికా సంఫ్‌ు హర్యానా, బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ యూనియన్‌ (సీఐటీయూ), రాష్ట్రీయ లోక్‌ దల్‌ చురు రాజస్థాన్‌, పీఎస్‌ఎస్‌ఈ సైంటిఫిక్‌ ప్రెసిడెంట్‌ పంజాబ్‌, ఎఐజిఈఎఫ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఢిల్లీ, మోహిత్‌ శర్మ పశ్చిమ బెంగాల్‌, ఫార్మర్స్‌ ఆర్గనైజేషన్‌ కమిటీ, ఆల్‌ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య, గుర్మీత్‌ సింగ్‌ ఖల్సా బ్లైండ్‌ పర్సన్‌ అసోసియేషన్‌, నాల్గవ రాష్ట్ర ఉద్యోగుల సమాఖ్య ఉత్తరప్రదేశ్‌, రైతు సంఘం, షహీద్‌ ఉధమ్‌ సింగ్‌ లైబ్రరీ కపుర్తలా పంజాబ్‌, గోపాల్‌ దత్‌ జోషి ప్రధాన్‌ చండీగఢ్‌ ఏఐఎస్జీఈఎఫ్‌, పిఎస్‌ఎస్‌ఎఫ్‌ ఆల్‌ ఇండియా, ఉమెన్స్‌ ఆర్గనైజేషన్‌ ఎయిమ్స్‌, ఏఐయూటీయూసీ, ఏఐడీ, ఎస్‌ యూసీఐ మిలిటరీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, విద్యార్థి యువజన్‌ సభ మౌ, ఉత్తరప్రదేశ్‌, ఆశా వర్కర్స్‌ అసోసియేషన్‌ ఢిల్లీ, యూత్‌ స్టూడెంట్‌ లీడర్‌, సోషలిస్ట్‌ యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (కమ్యూనిస్ట్‌) పలు సంఘాలు, పార్టీలు మద్దతు తెలిపారు.

Spread the love