Sunday, May 4, 2025
Homeజాతీయంకేరళలో పర్యటించి ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వ అనుభవాన్ని తెలుసుకుంటాం

కేరళలో పర్యటించి ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వ అనుభవాన్ని తెలుసుకుంటాం

- Advertisement -

– శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో

శ్రీలంకలో ఉన్న అన్ని ప్రాంతీయ, జాతి సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో ఉందని శ్రీలంక అధ్యక్షుడు, జేవీపీ నాయకుడు అనుర కుమార దిసనాయకే పునరుద్ఘాటించారు. కొలంబోలోని జేవీపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టిల్విన్‌ సిల్వా, పార్లమెంట్‌ స్పీకర్‌ జగత్‌ విక్రమరత్న, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు ఏఆర్‌ సింధుతో పాటు ఇండియా వామపక్ష నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌పీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజానుకూల చర్యలపై వివరణాత్మకంగా చర్చించారు. ఐఎంఎఫ్‌ పట్ల వారి విధానం గురించి వెల్లడించారు. ఆ ప్రాంతంలోని వామపక్షాల్లో ఉన్న ఆందోళన తనకు, తన పార్టీకి తెలుసని దిసనాయకే అన్నారు. తమిళ, ముస్లిం జనాభా సమస్యల పట్ల జేవీపీ, ఎన్‌పీపీ వైఖరి మారిందని తెలిపారు. అందుకే ఆ వర్గాలన్నీ ఎన్‌పీపీని అధికారంలోకి తీసుకొచ్చాయన్నారు. ఆర్థిక, ఇతర పరిమితుల మధ్య ప్రజల అంచనాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. పరస్పర సహకారంతో దక్షిణాసియాలో వామపక్షాల బలోపేతానికి తమ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. కేరళను సందర్శించి ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వ పాలనానుభవాన్ని తెలుసుకోవాలనుందన్న ఆసక్తిని వెలిబుచ్చారు. జేవీపీ ప్రధాన కార్యదర్శి టిల్విన్‌ సిల్వా ఎన్‌పీపీ ప్రభుత్వం ముందున్న సవాళ్లను, రాజకీయ, ఆర్థిక స్థిరత్వాన్ని వివరించారు.
మేడే ర్యాలీకి హాజరు కావాలని జేవీపీ ఆహ్వానం మేరకు ఇండియాకు చెందిన వామపక్ష పార్టీల నేతలు ఏఆర్‌ సింధు సీపీఐ(ఎం), బినరు విశ్వం (సీపీఐ), జి.దేవరాజన్‌ (ఫార్వర్డ్‌ బ్లాక్‌)లతో పాటు చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. మేడే రోజు శ్రీలంక రాజధాని కొలంబోలో నిర్వహించిన భారీ ర్యాలీలో దిసనాయకేతో పాటు కమ్యునిస్టు నేతలంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఆర్‌ సింధు మాట్లాడుతూ శ్రీలంకతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రమజీవులకు భారతదేశ కార్మికర్గం, సీపీఐ(ఎం) తరఫున విప్లవాత్మక శుభాకాంక్షలు తెలిపారు. మెరుగైన ప్రపంచం కోసం ధైర్యంగా పోరాడిన హేమార్కెట్‌ వీరులు సహా అసంఖ్యాక అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా గర్వంగా, గౌరవంగా గుర్తుచేసుకుంటున్నామన్నారు.
శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలు కార్మిక వర్గ ఉద్యమానికి, వామపక్షాలకు, ముఖ్యంగా దక్షిణాసియా దేశాల వారికి ప్రేరణగా ఉన్నాయని వెల్లడించారు. నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానం ఊహించని సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నా మన్నారు. పెట్టుబడిదారీ విధానం వ్యవస్థాగత సంక్షోభం నుంచి యూఎస్‌ఏ కూడా బయటపడలేకపోయిందన్నారు. పెట్టుబడిదారీ విధానం మానవాళి సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందనీ, శాస్త్రీయ సోషలిజం, మార్క్సిజం ఆధారంగా చేసిన తమ అంచనాలు నిరూపితమయ్యాయని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పాలన, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను కష్టాలపాలు చేస్తున్నాయని తెలిపారు. పాలస్తీనాలోని గాజా, వెస్ట్‌ బ్యాంక్‌ను ఆక్రమించడంలో ఇజ్రాయిల్‌కు మద్దతు ఇస్తూనే ఉందని విమర్శించారు. యెమెన్‌, లెబనాన్‌పై దాడులు కొనసాగుతున్నాయని, మొత్తం పశ్చిమాసియా ప్రాంతంపై తన ఆధిపత్యాన్ని స్థాపించాలని భావిస్తోందన్నారు.
సామ్రాజ్యవాద జోక్యాలను, దురాక్రమణలను ఖండిస్తున్నామని, ప్రపంచ శాంతి కోసం నిలబడతామని స్పష్టం చేశారు. కార్మికవర్గం, సామాన్య ప్రజలు శాంతి నుంచి ప్రయోజనం పొందుతుండగా, సైనిక, పారిశ్రామిక సముదాయాన్ని నియంత్రించే కార్పొరేట్లు యుద్ధం నుంచి ప్రయోజనం పొందుతాయని అన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఆర్థిక దిగ్బంధనాన్ని ప్రతిఘటిస్తున్న క్యూబా ప్రజలకు తాము సంఘీభావంగా నిలుస్తున్నామన్నారు. ట్రంప్‌ రాకతో కార్మిక వర్గ అంతర్జాతీయవాదంలో భాగంగా క్యూబాకు మద్దతు ఇవ్వడం తమ విధి అని స్పష్టం చేశారు.
భారతదేశం ప్రస్తుతం అత్యంత నయా ఉదారవాద, సామ్రాజ్యవాద అనుకూల, మతతత్వ బీజేపీ పాలనలో ఉందని, ఇది సమాజంలోని కార్మిక వర్గం, రైతులు, పేదలు, వెనుకబడిన వర్గాల వారి హక్కులపై దాడులు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య హక్కులు నిర్వీర్యమవుతున్నాయని, దేశ సమాఖ్య లక్షణం పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు. ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న కేరళలోని వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అప్రకటిత ఆర్థిక దిగ్బంధనాన్ని విధించిందన్నారు. బీజేపీ, దాని మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ మైనారిటీలు, వామపక్షాలను లక్ష్యంగా చేసుకుని మతతత్వ విషాన్ని వ్యాపింపజేస్తోందని విమర్శించారు.
అందుకే దీనిని నయా ఫాసిస్ట్‌ లక్షణాలతో కూడిన ప్రభుత్వంగా తాము నిర్ణయించామని అన్నారు. నయా ఉదారవాద విధానాల దూకుడుగా అమలు చేయడంతో కార్మిక వర్గంపై లక్ష్యంగా దాడి ఉందని, మొత్తం ఉపాధి రంగం తీవ్ర అనిశ్చితతో ఉందని తెలిపారు.
ఎనిమిది గంటల పని విధానం, కనీస వేతనాలు, సామాజిక భద్రత, సంఘం పెట్టుకునే స్వేచ్ఛ, సామూహిక బేరసారాలు, ముఖ్యంగా కార్మికవర్గంపై బానిసత్వ పరిస్థితులను విధించే లక్ష్యంతో దశాబ్దాల పోరాటాల తో సాధించుకున్న హక్కులతో సహా కార్మికవర్గం అన్ని హక్కులను తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో నాలుగు కార్మిక కోడ్‌లను తీసుకువచ్చిందని విమర్శించారు. ఐదేండ్ల క్రితం చట్టాలు ఆమోదించబడిన ప్పటికీ, దేశ కార్మికవర్గం ఇప్పటివరకు వాటి అమలును ఆపగలిగిందని తెలిపారు. కానీ ఇప్పుడు, అన్ని కార్మిక సంఘాలు, కార్మికవర్గం గొంతెను విస్మరించి ప్రభుత్వం ఈ చట్టాలను అమలు చేయాలనే ఉద్దేశాన్ని ప్రకటించిందన్నారు. ఈ కారణంతోనే సీఐటీయూతో సహా కార్మిక సంఘాల నేతృత్వంలోని భారతదేశ కార్మిక వర్గం మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిందని గుర్తు చేశారు. ఈ సమ్మెకు రైతు సంఘాల వేదిక ఎస్కేఎం మద్దతు ఇచ్చిందని, సాధారణ ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోందని తెలిపారు. కార్పొరేట్‌, మత సంబంధాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం నేతృత్వంలోని ప్రతిఘటన కొత్త దశకు ఇది నాంది అవుతుందని తాము హామీ ఇస్తున్నామన్నారు.
ఏడాదికి పైగా కొనసాగిన పోరాటంతో రైతు వ్యతిరేక చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకుందని, ఇది భారతదేశ చారిత్రాత్మక రైతు పోరాటమని అన్నారు. ఇది దేశంలో నయా ఉదారవాద వ్యతిరేక పోరాటాల్లో ఒక మైలురాయి అని తెలిపారు. ఈ పోరాటం అన్ని శ్రమజీవ వర్గాలకు, దేశ ప్రజలకు కూడా స్ఫూర్తినిచ్చిందన్నారు. ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం చురుకైన మద్దతుతో ఈ పోరాటం విజయవంతమైందని, కార్మికులు, రైతుల ఐక్య చర్యల వాతావరణాన్ని సృష్టించిందని అన్నారు. ఇది వర్గ ఐక్యతపై, పాలకవర్గ దాడిని ఓడించడానికి శ్రమజీవుల శక్తిపై నమ్మకాన్ని పునరుద్ధరించిందని తెలిపారు.
తమ పోరాటాల్లో శ్రీలంకలో మీ విజయం మా అందరికీ ప్రేరణగా ఉంటుందని అన్నారు. మీ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు, కేరళ వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక దిగ్బంధనంలో కేరళ శ్రీలంక మార్గంలో వెళుతుందని తమ ప్రత్యర్థులు అనేవారని అన్నారు. మీ విజయం తరువాత శ్రీలంక కేరళ మార్గంలో వెళుతుందని, ఇప్పుడు భారతదేశం శ్రీలంక మార్గంలో వెళుతుందని, శ్రీలంక నవ ఉదారవాద శక్తులను ఓడించిందని తాము గర్వంగా చెబుతున్నామని అన్నారు.
జేవీపీ, ఎన్‌పీపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకనుగుణంగా ఉంటుందని తాము విశ్వసిస్తు న్నామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. కానీ మనం ఇక్కడితో సంతృప్తి చెందకూడదని పేర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న పెట్టుబడిదారీ విధానం తనకు ఎదురయ్యే ఏ సవాలునైనా అణిచివేయడానికి ఏ కోణానికైనా వెళ్తుందని, వర్గ శత్రువులపై తీవ్ర అప్రమత్తతతో, కార్మికవర్గ సిద్ధాంతం పట్ల రాజీలేని నిబద్ధతతో ఉండాలని సూచించారు. ఈ చారిత్రాత్మక మేడే సందర్భంగా శ్రామికవర్గ అంతర్జాతీయవాదాన్ని సమర్థిస్తూ ఈ ర్యాలీని భారీ విజయంతో విజయవంతం చేసిన శ్రీలంక కార్మికులను, శ్రమించే ప్రజలను, జేవీపీ కార్యకర్తలు, నాయకులను అభినందిస్తున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -