కాశ్మీరు ప్రజల అభిప్రాయాలకు, వారి హక్కులకు, స్వేచ్ఛకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్య నియంతృత్వ ధోరణిలో కొనసాగుతున్నాయి. ఇవి ప్రజల మద్దతును పొందలేవు. సమస్యను మరింత జఠిలం చేస్తాయి. ఎప్పటికయినా అణచివేయాలని చూస్తే ఉబికిపైకి లేస్తుంది. సత్యాన్ని అంతమొందించడం చరిత్రలో ఎవరివల్లా కాలేదు. ఓ నిషేధాల నియంతమా! నీ వల్లా కాదు, ఇప్పుడు చదవాల్సిన పుస్తకాల జాబితాను ప్రకటించినందుకు సంతోషం! ఇక చరిత్ర గొంతెత్తి నిను నిషేధిస్తుంది!
అక్షరమంటే ఆధిపత్యానికి వణుకు పుడుతుంది. అక్షరాయుధాలకు నియంతలు భయకంపితులవుతారు. కలలో కూడా వారిని వాక్యాలు చుట్టుముడుతుంటాయి. అందుకే అనాదిగా అక్షరాలకు ఉరిబిగిస్తుంటారు. నిషేధపు ప్రకటనలతో వెర్రి ఆనందాన్ని పొందుతారు. కానీ వాళ్ళకు ఇప్పటికీ అర్థంకాని విషయమేమంటే అక్షరాలు భావ ప్రవాహాలు. ప్రవాహాన్ని అడ్డుకోవాలనుకున్న వాళ్ళందరూ అందులోపడి కొట్టుకుపోయిన వాళ్లే. అయితే అక్షరాలు నిండిన పుస్తకం ఎంత ప్రళయం సృష్టిస్తుందో వాళ్ళకు బాగానే తెలుసు. ముఖ్యంగా సత్యం ఎంత శక్తివంతమైనదో కూడా తెలుసు. అందుకే అసత్యాలతో, అబద్దాలతో బతుకీడ్చేవాడికి, వాటిపై అధికారాన్ని నిలబెట్టుకునే వాడికి పుస్తకాల్లో ఎక్కుపెట్టిన ప్రశ్నలకు ఏమి సమాధానం చెప్పగలుగుతాడు. నిషేధ బలప్రయోగాలు తప్ప వాడికి మరోదారి కనిపించదు. మాట నిషేధం, మౌనం నిషేధం, నిరసన నిషేధం, నిలుచోవడం నిషేధం, ఆందోళన నిషేధం, ఆవేశం నిషేధం, ప్రశ్న నిషేధం, చూపు నిషేధం, రాత నిషేధం, కవిత నిషేధం, కలలు నిషేధం, మానవత నిషేధం, చరిత నిషేధం, చైతన్యం నిషేధం! కంచెలు మొలిపిస్తాడు, సీలలు దిగ్గొడతాడు. కాదిది న్యాయం అంటే, బుల్డోజింగ్ చేస్తాడు.
చరిత్ర తిరగేయండి, నిషేధాలకు, నిర్బంధాలకు గురయినవన్నీ తిరిగి రెక్కలనెగరేస్తూ స్వేచ్ఛను శ్వాసించాయి. నిషేధించిన నియంతలు చరిత్ర కాలగర్భంలో హీనచరితులై అంతరించిపోయారు. ఆనాడు సామ్రాజ్యవాది బ్రిటీషోడు మన గ్రంథాలెన్నో నిషేధించాడు. ఇక్కడి నేలచేత నిషేధానికి గురయ్యాడు. నేరం చేసేవాడికి, అన్యాయం తలపెట్టేవాడికి న్యాయం వినిపిస్తే, కనిపిస్తే తట్టుకుంటాడా! కంపరమెక్కదూ! అందుకే మరి ఇప్పుడు వీడు పుస్తకాలను నిషేధించాడు. కొన్ని సంవత్సరాలుగా ప్రజలు చదువుతున్న పాతిక పుస్తకాలను, అందులోని చరిత్ర, రాజకీయ, సామాజిక విషయాలను, సంస్కృతినీ, సాహిత్యాన్నీ అంతా నిషేధానికి గురిచేశాడు. ఒక్కకలంపోటుతో చరిత్రతలను తెంపేసే పనిచేశాడు. జమ్మూకాశ్మీరు గతానికి చెందిన వాస్తవాలను పాతిపెట్టాలని తలపెట్టాడు. అక్కడ 370 ప్రత్యేక హక్కువల్లే సమానత్వం, శాంతి సమకూరటం లేదని ఆ హక్కును నిషేధించాడు. పెద్దనోట్ల వల్లే ఉగ్రవాదమని వాటినీ నిషేధించాడు. రాష్ట్రంగా ఉంటే కష్టాలు తప్పవని మూడు ముక్కలు చేసి ప్రజాపాలనను నిషేధించాడు. అయినా ఉగ్రవాదుల్ని నిషేధించలేకపోయాడు. నిరుద్యోగాన్ని, అభద్ర జీవనాన్ని, దుఃఖాన్ని, కన్నీళ్ళనీ నిషేధించలేకపోయాడు. ఇప్పుడేం చేయాలో అర్థంకాక రాజ్యాంగం కల్పించిన భావప్రకటనాస్వేచ్ఛనే నిషేధించాడు. ప్రజాస్వామ్యాన్ని నిషేధించాడు. ఇన్ని నిషేధాల తర్వాత ఏం మిగులుతుంది ఇక!
ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయవాది, చరిత్ర రచయిత ఎ.జి. నూరానీ రాసిన పుస్తకాన్ని, మొట్టమొదటి భారతీయ బుకర్ ప్రైజ్ గ్రహీత, సామాజిక ఉద్యమకారిణి, రచయిత్రి అరుంధతీరారు పుస్తకాన్నీ, జర్నలిస్టు అనురాధా భాసిన్, రాజనీతిజ్ఞులు, విద్యావేత్త సుమంత్రబోస్ మొదలైన ప్రసిద్ధుల పుస్తకాలనూ నిషేధించారు. అంతేకాదు, విదేశీ రచయితల పుస్తకాలూ వీరిని చాలా భయపెట్టాయి. తప్పుడు కథనాలు, వేర్పాటువాదాన్ని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టు ఉన్నాయని నిషేధకులు సెలవిస్తున్నారు. మరి ఆ ఆరోపణలకు ఒక్క ఆధారాన్నీ చూపించలేదు. ఏం చూపిస్తారు? సంవత్సరాలుగా జైళ్ళో పెట్టి, ఏ నేర ఆధారాన్నీ చూపలేని భయస్తులు, నేరస్తులు పుస్తకాల్లోని అక్షరాలను నిర్బంధించడం తప్ప ఏం చేయగలరు! అందుకనే రచయిత్రి అనురాధా భాసిన్ మాట్లాడుతూ – వాస్తవాలు ప్రజలకు, రాబోయే తరాలకు తెలియకుండా చేయటమే ఇదన్నారు. నిషేధించిన పుస్తకాలు చాలా పరిశోధించి రాసినవనీ, ప్రభుత్వం, తుడిచి పెట్టేసామని చెప్పుకుంటున్న ఉగ్రవాదాన్ని కీర్తించలేదనీ పేర్కొన్నారు. అబద్దాలను సవాలు చేస్తే భయపడుతున్నారని విమర్శించారు.
ధైర్యముంటే పుస్తకాల్లోని చరిత్ర పరిశోధనలపై చర్చచేయి. నీ వాదమేమిటో వినిపించు. ఆ దమ్ము అబద్దానికి ఉండదు. అన్యాయాల నోళ్ళకు అసలే ఉండదు. కాశ్మీరు ప్రజల అభిప్రాయాలకు, వారి హక్కులకు, స్వేచ్ఛకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్య నియంతృత్వ ధోరణిలో కొనసాగుతున్నాయి. ఇవి ప్రజల మద్దతును పొందలేవు. సమస్యను మరింత జఠిలం చేస్తాయి. ఎప్పటికయినా అణచివేయాలని చూస్తే ఉబికిపైకి లేస్తుంది. సత్యాన్ని అంతమొందించడం చరిత్రలో ఎవరివల్లా కాలేదు. ఓ నిషేధాల నియంతమా! నీ వల్లా కాదు, ఇప్పుడు చదవాల్సిన పుస్తకాల జాబితాను ప్రకటించినందుకు సంతోషం! ఇక చరిత్ర గొంతెత్తి నిను నిషేధిస్తుంది!
ఎంత భయం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES