– కేంద్రాల్లో వేధిస్తున్న గన్నీ బ్యాగుల కొరత, లారీ కేటాయింపులు
– కాంటాల కోసం రైతుల పడిగాపులు
– తరుగు పేర మిల్లర్ల నిలువు దోపిడీ
– అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నా సర్కార్ బేఖాతర్
– రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళన ొప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్
ఆరుగాలం కష్టపడి పంటసాగు చేసిన రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. పంటసాగు ప్రారంభం నాటి నుంచి పంటను విక్రయించే వరకూ అన్నదాత పడరాని పాట్లు పడుతున్నాడు. చివరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి పంటను తరలించినా అక్కడా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత, లారీల కేటాయింపులు లేక కాంటాల కోసం రోజుల కొద్దీ రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. కాంటా వేసిన ధాన్యం బస్తాలనూ మిల్లుల్లో దించడానికి మిల్లర్లు క్వింటాకు 5 నుంచి 7 కిలోల వరకు తరుగు పేర మెలికపెడుతున్నారు. ఇక అన్‌లోడింగ్‌కూ వారం రోజుల సమయం పడుతోంది. మరోపక్క అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. ఈదురుగాలులు, వడగండ్ల వానలకు కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం తడిసిముద్దవుతోంది. కొన్ని చోట్ల ధాన్యం బస్తాలోని ధాన్యం మొలకెత్తుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతన్నలు ఆందోళనలకు దిగుతున్నారు. తమ పంటను వెంటనే కొనుగోలు చేయాలని, మిల్లర్లు తరుగుపేర దోపిడీ చేయడం ఆపాలని, తడిసిన ధాన్యాన్ని రైస్‌మిల్లరు అన్‌లోడింగ్ చేయాలని కోరుతున్నారు.
నవతెలంగాణ-యంత్రాంగం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర, తిరుమలాయపాలెం, చండ్రుగొండ మండలాల రైతులు తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవుతోందని, వెంటనే ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. మధిర – విజయవాడ ప్రధాన రహదారిపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు, రైతు సంఘం నాయకులు పాపినేని రామనర్సయ్య, శీలం నరసింహారావు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తరలించి 15 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ఎందుకు ఆలస్యమవుతున్నాయని ప్రశ్నిం చారు. అకాల వర్షాలతో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతున్నదని, దీనికి ఎవరు బాధ్యత వహించాలని నిర్వాహకులను నిలదీశారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులు, సీపీఐ(ఎం) నాయకులతో మాట్లాడారు. సమస్యను సంబంధిత అధికారుల దష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. తిరుమలాయపాలెం మండలం బందంపల్లి గ్రామంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొమ్ము శ్రీను మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోని నిర్వాహకులు, మిల్లర్లు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వెంటనే ఉన్నతాధి కారులు జోక్యం చేసుకొని ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయా లని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు బింగి రమేశ్, తుళ్లూరి నాగేశ్వరావు, కోడి లింగయ్య, వీరేష్, చాగంటి వీరస్వామి, దుబాకుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బాలంపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షా లకు తడిసి ముద్దవుతోందని, వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ హమాలీల కొరత వేధిస్తోందని అన్నారు. రాయగిరి, బాలంపల్లి గ్రామాలకు చెందిన రైతుల ధాన్యం రాశులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని వాపోయారు. బాలంపల్లి కొనుగోలు కేంద్రంలో సర్కారు నిర్లక్ష్యంతోనే రైతులకు తీరని నష్టం ఏర్పడిందని, వారికి ఎకరానికి రూ. 50 వేల నష్టపరి హారం అందించాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు. అంతకుముందు రైతులు కలెక్టర్ కార్యాలయ అధికా రులకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన అధికారులు శనివారం సాయంత్రం కొనుగోళ్లు చేపట్టారు. హమాలీల కొరత తో కాంటాలు ఆలస్యమయ్యాయని, రైతులకు ఇబ్బందుల్లే కుండా కొనుగోళ్లు చేపడుతామని ఏపీఎం అంజయ్య తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మార్కెట్ గోదా ముల సముదాయంలోని కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యం బస్తాలను మిల్లులో దించడానికి క్వింటాకు 5 నుంచి 7 కిలోలు తరుగు ఇవ్వాలని మిల్లర్లు మెలికపెట్టడం సరికాదన్నారు. ఇప్ప టికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని మిల్లర్ల అవినీ తిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహదేవపూర్‌లో ధాన్యాన్ని పరిశీలించిన బీఆర్‌ఎస్ నాయకులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని ఎర్ర చెరువు వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి ధాన్యం తడిసిపో యింది. దీంతో మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి పుట్ట మధుకర్ శనివారం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు రైతులు 20 రోజుల క్రితమే ధాన్యం తీసుకొచ్చినా తేమ సాకుతో నిర్వాహకులు కాంటాలు పెట్టలేదని అన్నారు. దీంతో అకాల వర్షానికి పెద్దమొత్తంలో రైతులకు నష్టం వాటిల్లిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందనీ, ఈ పంట నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహిం చాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు స్పందించకపోవడం దారుణ మన్నారు. ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లుల వద్ద దించుకోకపోతే రైతులతో కలిసి రైస్‌మిల్లును ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మహిళా విభాగం మంథని నియోజకవర్గ అధ్యక్షురాలు కేదారి గీత, మాజీ సర్పంచ్ శ్రీపతి బాపు పాల్గొన్నారు.
అన్నదాత కన్నీరు
శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతుల ఆందోళన
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. స్థానిక మార్కెట్ యార్డులో రైతులు ఆరబెట్టిన వందల క్వింటాళ్ల వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షార్పణం కావడంతో రైతులు బోరుమన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ యార్డు ఎదురుగా శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న నిర్లక్ష్యం వల్లనే తమ పంట నీటి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షంతో నష్టపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోళ్లేవి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES