– గ్రేటర్‌లో అనుమతి లేనివి 10 వేలు..!
– కోట్లాది రూపాయల పన్నులు, ఫీజులు ఎగవేత..
– నగరంలో ఎన్ని సెల్‌టవర్స్ ఉన్నాయో తెలియని దుస్థితిలో బల్దియా
– దశాబ్ద కాలంగా కంపెనీల ఇష్టారాజ్యం
– అటువైపు కన్నెత్తి చూడని జీహెచ్‌ఎంసీ : సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి వెంకటేష్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆస్తి పన్ను చెల్లించని సామాన్యులపై దౌర్జన్యం చేసే జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం.. సెల్‌టవర్స్‌కు అనుమతి లేకపోయినా, ఫీజులు, పన్నులు చెల్లించకపోయినా అడిగే పరిస్థితే లేదని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్ అన్నారు. ముషీరాబాద్ గోల్కొండ చౌరస్తాలోని సీపీఐ(ఎం) నగర కార్యాలయంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్, సభ్యులు ఆర్.వెంకటేష్‌తో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో ఎన్ని సెల్‌టవర్లు ఉన్నాయో జీహెచ్‌ఎంసీ దగ్గర కనీసం లెక్కాపత్రం లేదన్నారు. లెక్కలతో సమాచారం సేకరించి 2017లోనే సీపీఐ(ఎం) పెద్ద ఆందోళన చేసిందని, అధికార యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పిందని గుర్తుచేశారు. 8 ఏండ్లలో ఏ మార్పూ లేకపోగా సెల్ టవర్ కంపెనీలకు అధికార యంత్రాంగం ఊడిగం చేస్తోందని విమర్శించారు.
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎన్ని సెల్ టవర్లు ఉన్నాయి.. ఎంత ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారని తాము సమాచార హక్కు చట్టం కింద అడగ్గా.. టౌన్ ప్లానింగ్ విభాగం నగరంలో 3203 టవర్లకు అనుమతిచ్చినట్టు తెలిపిందన్నారు. 14 కంపెనీలకు చెందిన 1105 సెల్‌టవర్ల నుంచి ఆస్తి పన్ను వసూలు చేస్తున్నామని చీఫ్ వ్యాల్యుయేషన్ ఆఫీసర్ చెప్పారన్నారు. ఈ టవర్ల నుంచి 2024-25లో బకాయిలతో కలిపి రూ.38.02 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ.2.05 కోట్లు మాత్రమే వసూలు చేశారని వివరించారు. జీహెచ్‌ఎంసీ అనుమతించామంటున్న సెల్‌టవర్లలో మూడో వంతు టవర్ల నుంచి మాత్రమే పన్ను వసూలు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రతి సెల్‌టవర్ లక్ష రూపాయల ఫీజు చెల్లించి అనుమతి పొందాల్సి ఉండగా ఏ కంపెనీ ఫీజు చెల్లించట్లేదన్నారు.
జీహెచ్‌ఎంసీ 2017-18లోనే 4773 సెల్‌టవర్ల నుంచి ఆస్తి పన్ను వసూలు చేస్తున్నామని ప్రకటించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం 1105 టవర్ల నుంచి మాత్రమే వసూలు చేస్తున్నామని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. ఇది నిర్లక్ష్యమా? కంపెనీలతో కుమ్మక్కైన ఫలితమా? అని ఎం.వెంకటేష్ ప్రశ్నించారు. కేంద్ర టెలికం శాఖ లెక్కల ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 13,979 సెల్‌టవర్లు ఉన్నాయని తేల్చిందని, ఇందులో 90శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటాయని అన్నారు. ఈ వివరాలు జీహెచ్‌ఎంసీ ఎందుకు సేకరించలేదని? ఈ టవర్ల నుంచి ఫీజులు, ఆస్తి పన్ను ఎందుకు వసూలు చేయరని ప్రశ్నించారు. పెద్ద సంఖ్యలో అనుమతి లేని సెల్‌టవర్లు కొనసాగడంపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫీజులు, ఆస్తి పన్ను పూర్తిస్థాయిలో వసూలు చేయాలని, అనుమతి లేని టవర్లపై వెంటనే చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) తరపున డిమాండ్ చేశారు.
అనుమతి లేని సెల్‌టవర్లపై చర్యలేవి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES