- ఎంపీ ప్రియాంకాగాంధీ
నవతెలంగాణ-హైదరాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికలనేపథ్యంలో సోన్‌బర్సాలో నిర్వహించిన ప్రచార సభలో కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ ప్రియాంకాగాంధీ బీజేపీపై తీవ్రవిమర్శలు చేశారు. ప్రధాని అనవసర విషయాలన్నీ మాట్లాడుతున్నారని, కానీ.. రాష్ట్రంలో ఎన్డీయే సర్కారు అవినీతి, దుష్పరిపాలనపై మాత్రం నోరు మెదపడం లేదన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రానికి వరాలు ప్రకటించే ముందు.. గత 20 ఏళ్లలో ఎన్డీయే సర్కారు ఏం చేసిందో మోదీ, అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానికంగా ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతోనే యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందన్నారు. ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ సన్నిహిత కార్పొరేట్‌లకు అప్పగించారని ఆరోపించారు.
‘‘అభివృద్ధి గురించి మాట్లాడటానికి బదులుగా.. ప్రతిపక్ష నేతలు దేశాన్ని, బిహార్‌ను అవమానిస్తున్నారంటూ ప్రధాని మోదీ పదేపదే ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాలపైనే ఎక్కువ దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. కాబట్టి.. దీని కోసం నూతనంగా ‘అవమానాల శాఖ’ను ఏర్పాటు చేయాలి’’ అని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు.



