Wednesday, October 22, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిబడులకు రక్షణేది?

బడులకు రక్షణేది?

- Advertisement -

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు ప్రతీ సంవత్సరం తగ్గుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూల్స్‌ పట్ల జనం ఆకర్షితుల వుతున్నారు. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూని ఫామ్‌, ఉపకార వేతనాలు, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం అందిస్తోంది. అయినప్పటికీ, ప్రభుత్వ పాఠశా లల్లో చేరికలు ప్రతీ సంవత్సరం తగ్గుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇదేదో ఈ ఒక్క ఏడాదికి వచ్చిన ఉప ద్రవం కాదు. పదేండ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. అయినా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పాలకులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ఏడాదికోమారు విద్యాశాఖ గణాంకాలు విడుదల చేస్తుంటుంది. కారణాలు మాత్రం విశ్లేషణ చేయలేక పోతోంది. ఈ పదేండ్ల కాలంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో భారీగానే విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2014- 15లో విద్యార్థుల సంఖ్య 24.85 లక్షల మంది ఉండగా, ప్రస్తుత విద్యాసంవత్సరానికి 16.96 లక్షలకు పడి పోయింది. అదే ప్రయివేటులో 31.17 లక్షల నుంచి 36.26 లక్షలకు పెరిగింది. ఒక్క కరోనాకాలంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఆ తర్వాత సంవత్సరం నుంచి తగ్గుతూనే ఉంది.
ప్రభుత్వ విద్యావ్యవస్థలో విద్యార్థుల సంఖ్య తగ్గి పోవడం కేవలం ఒక గణాంక సమస్యకాదు. దీనికి సమా జంలో ఉన్న అసమానతలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అం శాలు కారణం. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం గురుకులాలకు ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ విద్యా సంస్థలను విస్మరించింది. ప్రస్తుత ప్రభుత్వం యంగ్‌ ఇం డియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ పేరుతో ప్రభుత్వ విద్యా సంస్థ లను ప్రస్తావించడం లేదు. ప్రభుత్వం ప్రతీ ఏడాది కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని చెబుతోంది. బడుల భవ నాల నిర్మాణం, మౌలిక సదుపాయాల మెరుగుదల, డిజిటల్‌ సదుపాయాల పెంపు వంటి అంశాలు కాగితాల మీదనే మిగిలిపోతున్నాయి. గత ప్రభుత్వం మన ఊరు మన బడి తీసుకొచ్చింది. ప్రస్తుతం అమ్మ ఆదర్శ పాఠశా లలు అని ప్రకటించింది. నిధులు మాత్రం ఇవ్వడం లేదు. మరోవైపు టీచర్లు తగిన సంఖ్యలో లేకపోవడం, బోధనా నాణ్యత తగ్గిపోవడం, పాఠశాలల పట్ల తల్లిదండ్రుల నమ్మ కం తగ్గిపోవడానికి కారణమవుతోంది. రాజకీయంగా బలపడే నిర్ణయాలు తప్ప ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మ కాన్ని కల్పించలేకపోతున్నారు.
కేరళ రాష్ట్రం ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ నీయంగా తీర్చిదిద్దుతోంది. అక్కడ స్థానిక సంస్థలే ప్రభుత్వ విద్యా సంస్థలను పర్యవేక్షణ చేస్తుంటాయి.కావాల్సిన నిధులు అందిస్తుంటాయి. దూర విద్యార్థుల కోసం రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేశాయి. ఆ రాష్ట్రం ప్రభుత్వ పాఠ శాలలను ప్రయివేట్‌ స్కూళ్లకు సమానంగా తీర్చిదిద్దింది. మనదగ్గర ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు ప్రత్యేక రవాణా సదుపాయం లేదు. ప్రయివేటు యాజమాన్యాలు 30 నుంచి 40 కిలోమీటర్లు అయినా బస్సులను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నా కావాల్సినంత మంది టీచర్లు ఉండరు. టీచర్లు ఉంటే విద్యార్థులుండరు. ఇలాంటి చోట పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు.
ప్రతి తరగతికి ఒక టీచర్‌ తప్పనిసరి. చిన్నారుల విద్యలో ప్రాథమిక స్థాయి అత్యంత ముఖ్యమైనది. కాబట్టి ఉచిత ప్రీప్రైమరీ పాఠశాలలను ప్రభుత్వ స్థాయిలో ఏర్పాటు చేయాలి. ఆరు లక్షల మంది విద్యార్థులకు గాను ప్రయివేటులో ప్రీ ఫ్రైమరీలో ఐదు లక్షలు చేరితే, ప్రభుత్వం లో చేరింది లక్ష మంది. ఈ ఏడాది వెయ్యి పాఠశాలల్లో ప్రీప్రైమరీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. మిగతా 25 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అనుమతులు ఎప్పుడు ఉంటాయన్నది ప్రశ్న. పిల్లల మౌలిక విద్య, భాషా పటిమ, మానసిక వికాసం ఈ స్థాయిలోనే పునాది పడుతుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెరగాలంటే, తల్లిదండ్రుల దృష్టిని ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లించాలంటే విద్యారంగానికి తగినన్ని నిధులు కేటాయించాలి. పాఠశాలలో మౌలిక సదు పాయాలు కల్పించాలి. మూత్రశాలలు, మరుగు దొడ్లు, తాగునీరు వసతులు ఏర్పాటు చేయాలి. బడ్జెట్‌లో పదిహేను శాతం నిధులు కేటాయిం చాలి. ప్రీప్రైమరీ స్కూల్స్‌ను అన్ని పాఠశాలల్లో ప్రారంభించాలి. రవాణా సౌకర్యాన్ని కల్పించాలి. తరగతికొక టీచర్‌ను నియమించాలి. ఉపాధ్యా యుల్లో జవాబుదారీతనం పెంచాలి. పాఠశాలల పర్యవేక్షణాధికారుల పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీచేయాలి. విద్యా కమిటీలు ప్రభుత్వ స్కూల్స్‌ బలోపేతం కావడానికి విధా నాలను రూపొందించాలి. ప్రయివేటు విద్యా సంస్థలను నియంత్రించాలి. పైపైన మెరుగులు గాకుండా ప్రభుత్వ ఆలోచనలూ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడే విధంగా ప్రణాళిక తయారు చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -