నవతెలంగాణ-హైదరాబాద్: కేసీఆర్ చేసిన తప్పులకు పోలీసులు నోటిసులు ఇస్తే తప్పేంటని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నిజంగా జాతిపిత అయితే కేసీఆర్ ఎందుకు పదవులు ఆశించారని, ఉద్యమసాకుతో వేలకోట్ల వ్యాపారులను దక్కించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో అందర్నీ ఏకతాటిపై తీసుకొచ్చింది ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం అని నొక్కి చెప్పారు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కోదండరాం పట్ల కేసీఆర్ తీరును గుర్తు చేశారు. ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి, ఎత్తుకొచ్చి మరీ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్లంతా ఉన్నందంతా కోల్పోతే..కేసీఆర్ మాత్రం వేల కోట్లు సంపాదించారని విమర్శించారు. మధ్యకాలం నాటి రాజుల మాదిరిగా కేసీఆర్ వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు.
భూస్వామ్య వ్యవస్థను, రాజాకార్లు అరాచకాలను ఎదురించి, తన జీవితాన్ని ప్రజల సేవ కోసం అంకితం చేసిన మహానీయుడు రావినారాయణ రెడ్డి అని కొనియాడారు. వేల ఎకరాలను ప్రజలకు పంపిణీ చేశారని గుర్తు చేశారు.
భారత రాజ్యాంగ విలువలను కాపాడటంతో పాటు న్యాయ వ్యవస్థలో విశిష్ట ముద్ర వేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు’ లభించింది. ఈ మేరకు తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఇవాళ అవార్డు ప్రదానోత్సవ వేడుకను అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించి అవార్డును అందజేశారు.



