ఏంటిది?

what is This– పార్టీని పక్కకు పెట్టి ఇమేజి కోసం పాకులాటా?
– ముగ్గురు మధ్యలో సఖ్యత లేకపోతే కష్టం
– అధికారంలోకి ఎలాగూ రాలేం..
– కాంగ్రెస్‌ గెలిస్తే మనకే నష్టం
– గట్టిగా 15 నుంచి 20 స్థానాలపై దృష్టి పెట్టండి :కిషన్‌రెడ్డి, ఈటల, బండికి అమిత్‌షా క్లాస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘అసలే ఎన్నికల కాలం..ఏంటిది? పార్టీ ప్రయోజనాలను పక్కనబెట్టి సొంత అజెండాలతో ముందుకు పోవడమేంటి? మీ ముగ్గురి మధ్య సఖ్యత ఎందుకు దెబ్బతింటోంది? అధికారంలోకి రాకపోయినా సరే గట్టిగా 15 నుంచి 20 స్థానాలు దక్కేలాగైనా దృష్టి పెట్టండి..అలాగైతేనే బీఆర్‌ఎస్‌ను గుప్పిట్లో పెట్టుకోగలం. లేకుంటే కష్టమే! కాంగ్రెస్‌ గెలిస్తే అంతిమంగా మనకే నష్టం..కలిసిపొండి..మంచి ఫలితాలు సాధించండి..మీకు ఏం చేయాలి? ఏ పదవి ఇవ్వాలి? అనేది పార్టీ చూసుకుంటుంది..’అంటూ రాష్ట్ర బీజేపీ కీలక నేతలు కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, బండి సంజరులకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హితబోధ చేసినట్టు తెలిసింది. పార్టీని గాడిలో పెట్టాల్సిన కీలక నేతలే ఇలా గాడి తప్పడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తలపెట్టిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో షా ఆదివారం పాల్గొన్నారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని సీఆర్పీఎఫ్‌ ఆఫీసర్ల అతిథిగృహంలో ఆ ముగ్గురితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కేవలం పార్టీ ప్రయోజనాలపై దృష్టిపెట్టాలని అమిత్‌ షా వారికి అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది. చేరికల కమిటీ చైర్మెన్‌గా ఉన్న ఈటలకు, పార్టీ అధ్యక్షులుగా ఉన్న కిషన్‌రెడ్డికి మధ్య చేరికల విషయంలో గ్యాప్‌ రావడంపైనా గుస్సా అయినట్టు సమాచారం. అదే సమయంలో ఈనెల 26 నుంచి బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో బండి, ఈటల, కిషన్‌రెడ్డిల నేతృత్వంలో మూడు ప్రాంతాల నుంచి మూడు బృందాలుగా తలపెట్టిన బస్సు యాత్రలకు కూడా ఆయన అడ్డుకట్ట వేసినట్టు తెలిసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికలు బీజేపీకి చాలా కీలకం కానున్న నేపథ్యంలో కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశనం చేసినట్టు తెలిసింది. ఉత్తరాదిలో బీజేపీకి క్రమేణా పట్టు తగ్గుతుండటంతో రానున్న కాలంలో ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకం కానున్నది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అవసరం మనకుంటుందనీ, తెలంగాణలో బీజేపీ నేతలు కలిసికట్టుగా పనిచేయాలనీ, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించినట్టు తెలిసింది. తెలంగాణలో కనీసం 15 నుంచి 20 ఎమ్మెల్యే స్థానాలే లక్ష్యంగా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్లాలనీ, బీఆర్‌ఎస్‌కు బీజేపీ అవసరం సృష్టించాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇలాగైతేనే బీఆర్‌ఎస్‌ ఎంపీలు ఎన్‌డీఏ కూటమికి మద్దతిస్తారని కూడా స్పష్టం చేసినట్టు సమాచారం. ఏదేమైనా తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా చూడాలనీ, అందుకు రాష్ట్రంలోని నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. కాంగ్రెస్‌ బలం పెరిగితే అంతిమంగా మనకే నష్టమని అమిత్‌షా హెచ్చరించినట్టు తెలిసింది.

Spread the love