– ప్రభుత్వ వైఫల్యం… అధికారుల ఉదాశీనతతో లక్ష్యానికి తూట్లు
– సవాలక్ష నిబంధనలతో కార్మికులకు తప్పని ఇబ్బందులు
– ఏటా వెయ్యి మందికి కూడా లభించని ఊరట
కుటుంబ అవసరాల కోసం కొద్దో గొప్పో అప్పు తీసుకున్న పాపానికి జీవితాంతం కామంధుల వద్ద వెట్టి చాకిరీ చేసిన బడుగుజీవుల వెతలు మనకు సినిమాలలో కన్పిస్తుంటాయి. అప్పుకు వడ్డీలు… చక్రవడ్డీలు గుంజుతూ నిరుపేద కుటుంబ సభ్యులందరితోనూ రాత్రింబవళ్లూ పని చేయించుకుంటున్న భూస్వాములను కూడా మనం సినిమాలలో చూస్తుంటాం. వాస్తవానికి ఇవి కథలు కావు… స్వతంత్ర భారతావనిలో ఇలాంటి నిర్భాగ్యులు ఎందరో తారసపడుతుంటారు. ఇలాంటి అభాగ్యులకు పునరావాసం కల్పిస్తామని ఢాంబికాలు పలికిన మోడీ ప్రభుత్వం ఆ దిశగా పెద్దగా కృషి చేసిన దాఖలాలు లేవు. ఏటా 13 లక్షల మందిని వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం 2023-24లో కేవలం 468 మందికి మాత్రమే ఊరట కల్పించగలిగింది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి కుమారుడి వివాహం నిమిత్తం కాంట్రాక్టర్ వద్ద రూ.పది వేలు అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించలేక పోవడంతో ఆ కాంట్రాక్టర్ ఓ బిల్డర్‌తో కలిసి కుట్ర పన్ని తండ్రితో పాటు అతని ఇద్దరు కుమారులను భవన నిర్మాణ పనిలో పెట్టాడు. వారితో రాత్రింబవళ్లూ పని చేయించారు. పని ప్రదేశాన్ని వదిలి బయటకు పోయే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎనిమిది నెలల తర్వాత చిన్న కొడుకు పని చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. అతని వైద్య ఖర్చులను తప్పించుకోవడానికి బిల్డర్, కాంట్రాక్టర్ బెదిరింపులకు దిగి వారిని బలవంతంగా బయటికి పంపేశారు. సరైన వైద్య చికిత్స అందకపోవడంతో ఇప్పుడు ఆ యువకుడి చూపు సన్నగిల్లిపోతోంది. పార్లమెంటుకు కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.
1976లోనే చట్టం వచ్చినా…
21వ శతాబ్దపు నూతన భారతావనిలో ఇలా వెట్టిచాకిరీ చేస్తున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. 2030 నాటికి 1.84 కోట్ల మందిని వెట్టిచాకిరీ నుంచి విముక్తులను చేసి, వారికి పునరావాసం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం 2016లో లక్ష్యంగా నిర్దేశించుకుంది. అంటే ఏటా సగటున 13.14 లక్షల మందికి విముక్తి కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. వాస్తవానికి వెట్టిచాకిరీని నిర్మూలించాలన్న ప్రభుత్వ సంకల్పం ఈ నాటిది కాదు. 1976లో ప్రభుత్వం వెట్టి చాకిరీ వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం చేసింది. అయినప్పటికీ నేటికీ అది మన సమాజంలో కొనసాగుతూనే ఉంది. మైనర్ పిల్లలు సహా అనేక కుటుంబాలు యజమానుల కబంధ హస్తాలలో నలిగిపోతూనే ఉన్నాయి.
ఇది ఓ అభాగ్య కుటుంబం కథ
ముజఫర్‌నగర్‌లో 2021లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన చిన్న కుమారుడి వైద్య ఖర్చుల కోసం ఓ తండ్రి స్థానిక బెల్లం ఫ్యాక్టరీ యజమాని నుండి పది వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. 2023 నాటికి రుణం తీర్చలేకపోవడంతో ఫ్యాక్టరీ యజమాని ఆ తండ్రిని, అతని భార్యను, ఐదుగురు పిల్లలను కర్మాగారం లోనే ఉంచుకొని బలవంతంగా పని చేయించు కున్నాడు. నెలకు రూ.45,000 ఇస్తానని ఆశ చూపాడు. 2023 ఆగస్ట్ 16 నుంచి 2024 మార్చి 31 వరకూ ఆ కుటుంబం మొత్తం అక్కడ చాకిరీ చేసింది. సీజన్ ముగియడంతో వారు జీతాలు అడిగారు. అయితే డబ్బంతా మీ జీవనోపాధికే వెచ్చించానని, కేవలం రూ.45,000 మాత్రమే ఇవ్వాల్సి ఉన్నదని ఆ యజమాని బదులిచ్చాడు. తాము తిరిగి ఇంటికి పోతామని ఆ కుటుం బం చెప్పగా యజమాని వారికి సంబంధించిన వస్తువుల న్నింటినీ తన వద్దే అట్టే పెట్టుకొని పంపేశాడు. ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు… కొన్ని నెలలు గడిచిన తర్వాత యజమాని మళ్లీ వారందరినీ బలవంతంగా ఫ్యాక్టరీకి తీసుకొచ్చాడు. ఏప్రిల్ నెలాఖరు వరకూ వారితో ఫ్యాక్టరీలోనే కాకుండా ఇతర పనులు కూడా చేయించాడు. ఆ సమయంలో వారందరూ ఆకలికి నకనకలాడుతూ, శారీరక వేధింపులు భరిస్తూ, అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా కుటుంబ యజమాని భార్య పట్ల అమానుషంగా వ్యవహరించాడు. చివరికి వారికి ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వకుండానే పని నుండి తొలగించాడు.
అన్నింటా వైఫల్యమే
ఇలాంటి ఉదంతాలు మనకు ఎన్నో కన్పిస్తుంటాయి. పైన చెప్పిన మూడు సందర్భాలలోనూ అధికారులు బాధితుల వాంగ్మూలాలు నమోదు చేయలేదు. వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించినట్లు ధృవీకరణ పత్రాలు ఏవీ జారీ చేయలేదు. వారికి రావాల్సిన జీతాలు కూడా ఇవ్వలేదు. యజమానులపై ఎలాంటి విచారణలు, చర్యలు చేపట్టలేదు. కొత్త రూపాలతో ముందుకొస్తున్న బానిసత్వాన్ని నిరోధించా లని, అందుకు బాధ్యులైన వారికి శిక్షలను కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ తెలిపింది. అయితే బాధితుల స్టేట్‌మెంటును నమోదు చేయడంలో, వారిని వెట్టి చాకిరీ చేస్తున్న కార్మికులుగా గుర్తించడంలో, వెట్టి చాకిరీ నుంచి విముక్తులను చేస్తున్నట్లు ధృవపత్రాలు జారీ చేయడంలో వైఫల్యం కారణంగా లక్ష్యం నీరుకారిపోతోంది. బాధితులకు అవసరమైన పునరావాసం లభించడం లేదు. ప్రభుత్వం విధిస్తున్న సవాలక్ష నిబంధనలు లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాయి.
ఇలా అయితే లక్ష్యం నెరవేరేదెలా?
బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. బాధితులకు తక్షణ సాయంగా రూ.30,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. వెట్టి చాకిరీ చేసినట్లు ధృవీకరణ పత్రాలు ఉంటే వారి శ్రమ దోపిడీ ఆధారంగా లక్ష నుంచి మూడు లక్షల వరకూ అదనపు మద్దతు లభిస్తుంది. అయితే జిల్లా మెజిస్ట్రేట్ లేదా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అలాంటి కార్మికులను గుర్తించి ధృవీకరణ పత్రం జారీ చేస్తేనే ఈ సాయం అందుతుంది. అయితే అలాంటి కార్మికులను గుర్తించి, వారికి పత్రాలు జారీ చేయడంలో అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. అసలు వారి ప్రాధాన్యతలలో ఈ అంశమే ఉండడం లేదు. పార్లమెంటుకు సమర్పించిన తాజా డేటా ప్రకారం 2023-24లో ఐదు వందల మందికి కూడా పునరావాసం కల్పించలేదు. అలాంటప్పుడు లక్ష్యాన్ని చేరుకోవడం ఎలా సాధ్యపడుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. పునరావాసం కల్పిస్తున్న కార్మికుల సంఖ్య ఏటా తగ్గుతుండడం గమనార్హం.
గత మూడు సంవత్సరాలలో కార్మికుల పునరావాస రేటు సుమారు 80 శాతం తగ్గిందని, సగటున ఏటా 900 మందికి మాత్రమే పునరావాసం లభిస్తోందని ఔట్‌లుక్ పత్రిక తెలిపింది. ఇదే రీతిన పునరావాస కార్యక్రమం కొనసాగితే 2030 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యంలో కేవలం రెండు శాతమే నెరవేరుతుందని గణాంకాలు చెబుతున్నాయి.
రాష్ట్రాలపై నెపం మోపి…
అయితే తన జవాబుదారీతనం నుంచి కేంద్ర ప్రభుత్వం తేలికగా తప్పించుకునే అవకాశం ఉంది. రాష్ట్రాలపై నెపాన్ని నెట్టి చేతులు దులుపుకోవచ్చు. ఎందుకంటే లక్ష్యాన్ని చేరుకోవాలంటే రాష్ట్రాల మద్దతు తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ, దాని సబ్ డివిజన్లలోనూ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వెట్టి చాకిరీ నుంచి బయపడిన కార్మికులకు ఆర్థిక, సామాజిక పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కూడా ఈ కమిటీదే.
రూ.పది వేల అప్పు కోసం…
ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం కేవలం పది వేల రూపాయలు తీసుకొని హర్యానాలోని సోనీపట్‌లో ఐదున్నర నెలల పాటు వెట్టి చాకిరీ చేసింది. దారుణమైన విషయమేమంటే వారిలో ఏడాది వయసున్న బాలికతో పాటు నలుగురు మైనర్లు ఉన్నారు. వీరందరూ ఎలాంటి వేతనం లేకుండానే పని చేశారు. చివరికి ఆకలికి తాళలేక ఒకరు పారిపోయారు. దీంతో భయాందోళనలకు గురైన ఆ కుటుంబం మరునాడే కట్టుబట్టలతో ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోయింది. సుదీర్ఘ ప్రయాణం చేసిన ఆ కుటుంబం చివరికి ఎలాగోలా స్వస్థలానికి చేరినప్పటికీ దారిలోనే ఓ మహిళ ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయింది.
వెట్టి చాకిరీ నుంచి విముక్తి ఎప్పుడు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES