నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్, జార్ఖండ్‌తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు ఛట్ పండుగను బాగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా ఎక్కడకెక్కడికో వలస వెళ్లిన బీహార్ ప్రజలు స్వరాష్ట్రానికి చేరుకుంటారు. అయితే ప్రయాణీకులకు సరిపడనన్ని రైళ్లు లేకపోవడంతో రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులు తోసుకుంటునారు. రైళ్లన్నీ కిక్కిరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైళ్ల రద్దీపై ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఎన్‌డిఎ ప్రభుత్వం పండుగల సందర్భంగా ప్రయాణీకుల కోసం 12 వేల ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చింది. ప్రజలకిచ్చిన ఆ హామీని నెరవేర్చరా? ఆ 12 వేల ప్రత్యేక రైళ్లు ఎక్కడున్నాయి అని మోడీ ప్రభుత్వాన్ని రాహుల్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.
ఇది పండుగల నెల. ఈ నెలలో దీపావళి, భారు దూజ్, ఛట్ పండుగలున్నాయి. బీహార్‌లో జరుపుకునే ఈ పండుగలు విశ్వాసం కంటే ఎక్కువ. వారి మట్టి పరిమళం కోసం, కుటుంబ సభ్యుల ప్రేమ కోసం, గ్రామం కోసం బీహారీలు తమ స్వరాష్ట్రానికి వస్తారు. ఇప్పుడు వారు స్వరాష్ట్రానికి రావాలనే కోరిక.. ఒక పోరాటంగా మారింది. బీహార్‌కి వెళ్లే రైళ్లు కిక్కిరిసిపోయాయి. టిక్కెట్లు పొందడం అసాధ్యం. ఇక ప్రయాణం అమానవీయంగా మారింది. చాలా రైళ్లు వాటి సామర్త్యానికి మించి మోసుకెళుతున్నాయి. దాదాపు 200 శాతం పైగా సామర్థ్యంతో మోసుకెళుతున్నాయి. ప్రజలు తలుపుల్ని, పైకప్పుల్ని పట్టుకుని వేలాడుతూ ప్రయాణీస్తున్నారు అని రాహుల్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
ప్రయాణీకుల ఇబ్బందులపై రాహుల్ ఎన్‌డిఎ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రజలు నిస్సహాయ ప్రయాణీకులు కాదని, ఎన్‌డిఎ మోసపూరిత విధానాలకు, ఉద్దేశాలకు సజీవ సాక్ష్యమని అన్నారు. పండుగల సందర్భంగా ఎన్‌డిఎ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న 12 వేల ప్రత్యేక రైళ్లు ఎక్కడ ఉన్నాయి? ప్రతి సంవత్సరం పరిస్థితులెందుకు దిగజారిపోతున్నాయి? బీహార్ ప్రజలు ప్రతి సంవత్సరం ఇలాంటి అవమానకరమైన పరిస్థితుల్లో ఇంటికి తిరిగి వచ్చేలా ఎందుకు నెట్టబడుతున్నారు? రాష్ట్రంలోనే ఉద్యోగం, గౌరవప్రదమైన జీవితం ఉంటే.. వారు వేల కిలోమీటర్ల దూరం తిరగాల్సిన అవసరం ఉండేది కాదు కదా. సురక్షితమై, గౌరవప్రదమైన ప్రయాణం ఒక హక్కు. అదేదో ఉపకారం కాదు అని రాహుల్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
కాగా, ఛట్ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పిన ఎన్‌డిఎ ప్రభుత్వ హామీపై ఆర్‌జెడి సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్‌డిఎ ప్రభుత్వంపై మండిపడ్డారు. అసలు దేశంలో నడుస్తున్నదే 13,198 రైళ్లు. వీటిలో ఛట్ పండగు సందర్భంగా బీహార్‌కే 12 వేల రైళ్లు నడిపిస్తామని ఎన్‌డిఎ చెప్పిన హామీ.. అబద్దపు హామీ అని లాలూ మండిపడ్డారు.



