నవతెలంగాణ – కామారెడ్డి : జిల్లాలో కల్తీ నూనెల వ్యవహారం రోజురోజుకీ ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరు నెలల క్రితం ప్రజావాణి కార్యక్రమంలో కల్తీ నూనెల తయారీపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం గమనార్హం. ఫిర్యాదు నేపథ్యంలో ఆర్డీవో, ఫుడ్ సేఫ్టీ అధికారి, సివిల్ సప్లై అధికారి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు నట్లు సమాచారం. అయితే, ఆ కమిటీ పరిశీలనకు వెళ్లిన రోజే ఫిర్యాదుదారునికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఫిర్యాదు చేసినవారిలో భయాందోళనలు నెలకొన్నాయి.
ఇంకా, కల్తీ నూనెల తయారీలో ఉపయోగించే “AD-Mixed” వంటి పదార్థాలు కంపెనీలో కనిపించాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ అధికారులు ఈ విషయంపై లోతైన దర్యాప్తు చేయకుండా, డబ్బులతోనే వ్యవహారం ముగిస్తున్నారా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఈ తరహా కల్తీ ఆహార పదార్థాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి అక్రమాలను అరికట్టాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నిజానిజాలను వెలికితీసి, కల్తీ నూనెల తయారీని పూర్తిగా అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తులసి ఆయిల్ ఇండస్ట్రీస్ కేంద్ర పరిధిలో ఉంది ( జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి విక్రమ్ )
ఇటీవల తీసుకున్న ఆయిల్ శాంపిళ్లను ప్రయోగశాలకు పంపించగా, వాటిలో ఎలాంటి కల్తీ లేదని ల్యాబ్ నివేదికలో వెల్లడైంది. తులసి ఆయిల్ ఇండస్ట్రీస్ కేంద్ర లైసెన్సింగ్ పరిధిలో పనిచేస్తుందని సంబంధిత జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి పేర్కొన్నారు.



